హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ‘స్థానికత’ అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషర్లు కూడా పిటిషనర్ నంబర్‌లో జాబితా సిద్ధం చేసి, సంబంధింత అధికారులకు అందజేయాలని సూచించింది. ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ‘ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీస్ అడ్మిషన్ నిబంధనలు 2017లోని రూల్ 3(ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగనరసింహతోపాటు మరో 13 మంది తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.