calender_icon.png 29 December, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోలు బొమ్మలాట కళాకారుడు మోతె జగన్నాథం మృతి

27-12-2024 02:39:38 AM

* చెక్కతీగల తోలుబొమ్మల ఆటకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి

*  పలు రాష్ట్రాల్లో జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు 

హైదరాబాద్ సిటీబ్యూరో,  డిసెంబర్ 26 (విజయక్రాంతి): శతాబ్ద్ధాల కాలంనాటి కథా సంప్రదాయ పరిరక్షణకు అంకితమై దేశవ్యాప్తంగా అనేక జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలిచ్చి చెక్కతీగల బొమ్మలాటలో ప్రఖ్యాత కళాకారుడిగా గుర్తింపు పొందిన మోతె జగన్నాథం(౭౮) తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా అమ్మాపురం గ్రామానికి చెందిన జగన్నాథం చెక్కతీగల తోలుబొమ్మలాట కళ ఉనికి కోసం నిరంతరం పరితపించారు. దేశవ్యాప్తంగా అనేక జాతీయ స్థాయి వేదికలపై కళా ప్రదర్శనలిచ్చి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు.

తన ప్రత్యేకమైన కళతో రామాయణం, మహాభారతం, భక్త ప్రహ్లాద, రామదాసు వంటి కథలకు ప్రాణం పోశారు. మోతె జగన్నాథం మరణంతో తెలంగాణ ప్రాంతపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చెక్కతీగల తోలుబొమ్మ లాటల బృందాలు ఇంకా రెండు బృందాలు మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌లో జరిగిన వివిధ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో జగన్నాథం అనేక ప్రదర్శనలిచ్చారు.

చలన చిత్ర నిర్మాత అజిత్ నాగ్ చెక్కతీగల తోలుబొమ్మలాట, వారి ప్రత్యేక సాంస్కృతిక విలువను పెంచేలా తీసిన బొమ్మలోళ్లు డాక్యుమెంటరీలో మోతె జగన్నాథం జీవితాన్ని చిత్రీకరించారు. చెక్కబొమ్మల తోలుబొమ్మలాట కళాకారుడు మోతె జగన్నాథం మృతి తెలంగాణ కళారంగానికి తీరని లోటని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ వాపోయారు. 

అమ్మాపురంలో విషాదఛాయలు

జనగామ, డిసెంబర్ ౨౬ (విజయక్రాంతి): జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురం గ్రా మానికి చెందిన ప్రముఖ తోలుబొమ్మలాట కళాకారుడు మోతే జగన్నాథం కన్నుమూశారు. దీంతో ఆయన స్వగ్రామం అమ్మా పురంలో విషాదఛాయలు అలుముకున్నా యి.

మంగళవారం జగన్నాథంకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం దుతూ మృతిచెందారు. బుధవారం అమ్మాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు.