నోటా విధానం వల్ల నిజాయితీ, నైతిక విలువలు పాటించే వారిని మాత్రమే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా బరిలోకి దించుతారనే ఆశాభావాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే, ఒక మంచి ఉద్దేశ్యంతో వెలువరించిన ఈ తీర్పుకు అన్ని రాజకీయ పార్టీలు తిలోదకాలిచ్చాయి. నైతిక విలువలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు, కులం, మంది మార్బలం ఉండే వారినే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయనేది అవునన్నా కాదన్నా నేటి వాస్తవచిత్రం. గత అయిదేళ్ల కాలంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలతో కలిపి నోటాకు 1.29 కోట్లకు పైగా ఓట్లు లభించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే నేర చరిత అభ్యర్థుల సంఖ్య సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ పెరిగిపోయింది.
సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్‌తోపాటు, ప్రముఖ వార్తా పత్రికల్లో తమ మీద ఉన్నటువంటి నేర చరిత్రను బహిర్గతం చెయ్యాల్సి వుంది. ‘ఇంతటి కఠినమైన ఆంక్ష వున్నప్పటికీ రౌడీలు, నేర చరితులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావటంలో లోపం ఎక్కడుంది?’ అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ద్వారా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరో తీర్పు రావాలి లేదా పార్లమెంటు అయినా సంచలన నిర్ణయం తీసుకోవాలి.
నోటా (నన్ ఆఫ్ ది అబోవ్) విధానం మొదటిసారిగా 2013లో చత్తిస్‌గడ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశ పెట్టడం జరిగింది. ‘పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్’ వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకటిస్తూ ‘నోటా అనే బటన్‌ను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో (ఈవీఎం) పోటీలో ఉన్న అభ్యర్థులకు చివరగా చేరుస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా’ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ‘భారత ఎన్నికల సంఘం’ నోటా ఆప్షన్‌ను క్రాస్ గుర్తుతో చేర్చింది.
గోప్యతకు ఢోకా లేదు
ఓటు వేయటమనేది ఓటరు ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం పరిగణనలోకి తీసుకోలేదు. ఓటు వినియోగం కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాబట్టి, ఏ ఓటరైతే ఓటు వేయటానికి ఇష్టపడడో అతనికి ఓటు వేయటానికి నిరాకరించే హక్కుకూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం కల్పించింది. అయితే, ఓటు వేసిన వారు తాము ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు ఉన్నట్లే, పోటీలోని అభ్యర్థులు ఎవరినీ ఎన్నుకోడానికి లేదా ఏ ఒక్కరికీ ఓటు వేయటానికి ఎవరైతే ఇష్టపడరో ఆ పౌరుడూ గోప్యతను కోరుకోవటంలో తప్పు లేదు. ‘ఇవిఎం’ విధానం వచ్చాక, నోటాకు ఓటు వేసేవారి గోప్యతకు రక్షణ లభించింది. కానీ, అంతకు ముందు పద్ధతి వేరు.
నోటా అమలుకు ముందు ఏదేని ఓటర్ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి బ్యాలెట్ పేపర్ తీసుకున్న పిదప, పోటీలో ఉన్న ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే, ప్రిసైడింగ్ అధికారి ‘ఫారం 17’లో అటువంటి ఓటర్ పేరు ఎదురుగా రిమార్క్ రాసి ఆ ఓటర్ సంతకం తీసుకోవటం, బ్యాలెట్ పేపర్ మీద, దాని కౌంటర్ ఫైల్ మీద ‘రిటర్న్ చేయబడింది/ రద్దు చేయబడింది’ అని రాసి, ఆ బ్యాలెట్ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో భద్ర పరచే విధానం వుండేది. ఆ విధంగా రిమార్క్ రాసి, రద్దు చేయబడిన బ్యాలెట్లను ప్రత్యేక కవర్‌లో ఉంచేవారు. దాంతో ఆ ఓటరు ఓటు వేయలేదనే గోప్యత బహిర్గతమయ్యేది. తద్వారా అతని భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లేది. ఈ గోప్యతకు భంగం కలుగకుండా నివారించటానికి, పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఓటరుకు పోటీలో ఉన్న ఏ అభ్యర్థీ నచ్చకపోతే, ‘ఈవీఎం’లోని నోటా బటన్‌ను నొక్కితే సరిపోతుంది. ఓటరు ఎవరికీ ఓటు వేయలేదనేది గోప్యంగానే ఉండిపోతుంది.
నోటాకు విలువ లేనట్లేనా?
రాజ్యసభ, విధానమండలి ఎన్నికల్లో ఈ విధానం అమలులో లేదు. ‘ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భంలో ఎటువంటి చర్య తీసుకోవాలి?’ అనే దానికి కూడ సుప్రీంకోర్టు అప్పట్లోనే జవాబిచ్చింది. నోటాకు అత్యధికంగా ఓట్లు పోలయి, మొదటి స్థానంలో నిలిచినట్లయితే, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ‘నోటాకు పోలైన ఓట్లు మొదటి స్థానంలో ఉండి, పోటీలోని ఏ అభ్యర్థికైనా మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు కంటే తక్కువ ఓట్లు వచ్చినట్లయితే అతడు ధరావత్తు కోల్పోతాడా?’ అన్న ప్రశ్నకు కూడా ‘భారత ఎన్నికల సంఘం’ ‘కాదని’ సమాధానం చెప్పింది. అటువంటి సందర్భంలో నోటాకు పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా మిగతా ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ధరావత్తు విషయం నిర్ణయిస్తారు.
నోటా విధానం ఓటర్లను ప్రభావితం చేసి వారిని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకు వెళ్తుందని, తద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. కానీ, ఈ నోటా విధానానికి రాన్రాను ప్రాముఖ్యం తగ్గిపోతున్నది. ఎందుకంటే, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించటం, అభ్యర్థుల ధరావత్తు నిర్ణయించటానికి నోటాకు పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకోక పోవటం అనే విషయాలను నిపుణులు జీర్ణించుకోలేక పోతున్నారు. పోటీలోని ఏ అభ్యర్థి మాకు తగిన వ్యక్తి కాదని నియోజకవర్గంలోని అత్యధిక ఓటర్లు తిరస్కరించే సందర్భంలోనూ రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించటం భావ్యం కాదన్నది కొందరి అభిప్రాయం.
అసమర్థులకు పట్టం తప్పదా?
నోటాకు అత్యధిక ఓట్లు పోలైతే పోటీలోని అభ్యర్థులను కొన్ని సంవత్సరాల పాటు పోటీ చేయటానికి అనర్హులుగా ప్రకటిస్తూ, ఆ నియోజక వర్గానికి మరోసారి ఎన్నిక జరిపేటట్లు ఆదేశాలివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ముందు కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఇలా, రెండోసారి లేదా మూడోసారి ఎన్నిక జరపటం అనేది చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్నదని, మన దేశంలో ఇటువంటి విధానం ఆచరణ యోగ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ‘నీతిమాలిన, నైతిక విలువలు లేని, మెజారిటీ ఓటర్ల చేత తిరస్కరణకు గురైన అభ్యర్థిని ఐదేళ్లపాటు నియోజకవర్గ నాయకుడిగా గుర్తించటం’ అంతకంటే ఘోరమైన విషయమని పలువురు రాజనీతిజ్ఞులు, ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వంటి స్థానిక ఎన్నికలకు ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తించడం లేదు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( ఎడిఆర్) నివేదిక ప్రకారం గత పదేళ్లుగా క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య పెరుగుతూ ఉంది. 2009లో ఎన్నికయిన ఎంపీలలో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగింది. ఎడిఆర్ విశ్లేషించిన మొత్తం 543 మంది ఎంపీలలో 162 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 76 మంది అంటే 17శాతం మందిలపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులున్నాయి.
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా జడ్జి)
తడకమళ్ళ మురళీధర్