- వానకాలంలోనే అమలు చేస్తామన్న రాష్ట్రసర్కార్
- యాసంగి ప్రారంభమైనా పాలసీ ఊసే లేదు..
- జనవరి నుంచైనా ప్రారంభించాలని రైతుల డిమాండ్
- నీటిఎద్దడితో పంట ఎండితే నష్టపోతామని ఆవేదన
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): వానకాలంలోనే పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు యాసంగికి అదును వచ్చినా హామీ నెరవేర్చకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
గతేడాదిలో పంట నష్టం సంభవించగా నాటి ప్రభుత్వం కంటితుడుపు చర్యగా ఎకరానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేసిందని, కానీ.. ఈ ప్రభుత్వమైనా శాస్త్రీయమైన బీమా పథకానికి శ్రీకారం చుట్టాలని కోరుతున్నారు. ఒక్కసారి బీమా వర్తిస్తే తమకు ప్రకృతి విపత్తులు వచ్చినా, నీటి ఎద్దడి ఎదురైనా భరోసా ఉంటుందంటున్నారు.
యాసంగి ప్రారంభమైనందున రైతుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ సీజన్‌లో భూగర్భజలాలు తగ్గిపోయి, పంటలకు సక్రమంగా నీరు అందని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పంట నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పటికైనా బీమా అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనవరిలోనైనా బీమాపై మార్గదర్శకాలు ప్రకటిస్తే, ఈ సీజన్‌లో తాము నష్టపోయే పరిస్థితి రాదని స్పష్టం చేస్తున్నారు.
వాతవరణాన్ని పరిగణలోకి తీసుకోవాలని..
వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగవుతాయి. యాసంగిలో ఆ విస్తీర్ణంలో సగం మాత్రమే సాగవుతుంది. యాసంగిలో భూగర్భజలాలు అడుగంటడం, సాగునీరు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చి రైతు నష్టపోవాల్సి వస్తుంది.
కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా రైతులకు బీమా పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా, కోతల తర్వాత కలాల్ల్లో పంట ఉన్నప్పడు నష్టం జరిగితే మరోరకంగా పరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ యోచిస్తున్నది.
ఇప్పటికే ఈ ప్రాతిపాదనలను సూత్రప్రాయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరను బట్టి ప్రభు త్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ఉండాలని..
కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా వర్తింపు గ్రామ యూనిట్‌గా ఉంటుంది. ప్రకృతి విపత్తులు లేదా ఏదైనా ఇతర కారణాలతో 33 శాతం పంట దెబ్బతింటేనే రైతు బీమా పొందేందుకు అర్హుడు. ఉదాహరణకు ఒక రైతుకు 12 ఎకరాల్లో పంటలు సాగు వేస్తే, దానిలో 4 ఎకరాలకు పైగా దెబ్బతింటేనే ఫసల్ బీమా పరిహారం వచ్చేది.
కొత్తగా అమలు చేసే బీమాకు నిబంధనలు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ఉండాలని రైతులు కోరుతున్నారు. ఉదాహరణకు.. ఒక రైతుకు ఉన్న ఎకరా పొలంలో అర ఎకరా దెబ్బతిన్నా బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈవిధంగానే బీమా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవాలని విన్నవిస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో బీమా ఆలస్యం
రాష్ట్రప్రభుత్వం ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నందునే బీమా ప్రతిపాదనను ప్రస్తుతా నికి పక్కనే పెట్టినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రైతులకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇప్పటికే రైతుభరోసా, రుణమాఫీ పథకాలు తలకు మించిన భారంగా ఉందని, ఇక బీమా కూడా అమలు చేస్తే మరిన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తుందని తెలిసింది.