ఇఛ్ఛామారంభ నిష్పత్తిం
ప్రయోగం వ్యాజముద్ధయత్
క్షయవ్యయో చ జానీయాత్
కుప్యానామాయుధేశ్వరః
- కౌటిలీయమ్ (2-
“ఆయుధాల అధ్యక్షుడు కర్మాగారాల విషయంలో రాజు అభిప్రాయాలను, పని ప్రారంభించ వలసిన విధానాన్ని, దాని సాఫల్యతను, దోషాన్ని, లాభాలను, వివిధ అరణ్య వస్తువుల నష్టాన్ని, ఖర్చులను బాగా తెలుసుకొని ఉండాలి” అంటాడు ఆచార్య చాణక్య.
‘కౌటిలీయం’ 2వ అధికరణం, 18వ అధ్యాయంలో ఆయుధాల వివరాలను, వాటిని ఉపయోగించడం గురించి వివరంగా చెప్పాడు చాణక్యుడు.
యుద్దంలో విజయాన్ని సాధించాలంటే ఆయుధాల అధ్యక్షుడు వాటిని పరిరక్షించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించాడు. ఆయుధాల అధ్యక్షుడు ఒక సంస్థకు నిర్వాహకుడు అనుకుంటే ‘వ్యాపారమనే యుద్ధాన్ని గెలవడానికి అతను ఏం చేయవలసి ఉంటుంది?’ ఇది ఈ తరం వారు తెలుసుకోదగ్గది. నిర్వాహకుడు ఎప్పుడూ ఓడకుండా ఉండేందుకు కాదు, గెలిచేందుకు పోరాడాలి. దానికి అవసరమైన సన్నద్ధతను అతను/ ఆమె కలిగి ఉండాలి. ఆయుధాలనేవి మానవ వనరులు, ఆర్థిక వనరులు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులు, యంత్రసామాగ్రి. ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, సరైన సమయానికి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారునికి అందించడం.. మొదలైనవి. వీటికి తోడుగా నిర్వాహకునికి వివిధ పరిశ్రమల గురించిన ఆచరణ యోగ్యమైన సాంకేతిక పరిజ్ఞానం అపారంగా ఉండాలి. ఉత్పత్తి చేసే యంత్రాలకన్నా వాటిని నడిపించే ఉద్యోగులు లేదా సంబంధిత వ్యక్తులు ఆదరణీయులు. విజ్ఞానం, నైపుణ్యం, నిబద్ధత కలిగిన మానవ వనరులు సంస్థను ఉన్నత పథంలో నిలుపుతాయి. దానికి తోడుగా సరైన విశ్లేషణతో కూడిన సమాచారం అవసరానికి మించి నాయకునికి అందుబాటులో ఉండాలి. పరిశోధన, అభివృద్ధిని నిరంతరం కొనసాగిస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం నాయకునికి అవసరం. ఉత్పత్తి, ఉత్పాదకత, అమ్మకాలు బాగుండవచ్చు కాని, ఆశించిన లాభాలు రాకపోతే వ్యాపార నిర్వహణ అసాధ్యమవుతుంది. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేని వినియోగదారులను ఆశ్రయించడం వల్ల సమయం వృధా అవడం తప్ప ఫలితం ఉండదు. అలాంటి వినియోగదారులను దూరంగా ఉంచడం ఉత్తమం. విశ్వాసపాత్రులైన, కొనుగోలు సామర్థ్యం కలిగిన వినియోగదారులతో నిరంతర సాంగత్యాన్ని కొనసాగించాలి. వినియోగదారులకు సంస్థ ఉత్పత్తులపట్ల సకారాత్మక అనుభవం కలిగే విధంగా ప్రవర్తించాలి.
వినియోగదారుల
విశ్వాసమే లక్ష్యంగా..
స్వల్ప పరిమాణంలో ఉపయోగపడే ఉత్పత్తులకు లేదా సేవలకు ఎక్కువ సమయాన్ని ఇవ్వడం అసమంజసం. ఉత్పత్తి వ్యయం ఎంత, దానిపై ఎంత లాభాన్ని ఆశిస్తున్నామో స్పష్టత ఉండాలి. వినియోగదారుడు తగ్గింపు ధరను కోరుకుంటాడు. అయితే, బేరమాడే సమయంలో ఏ ధరను ప్రకటిస్తున్నామో దానిని ఎంత వరకు తగ్గించి ఇవ్వగలమో స్పష్టత ఉండాలి. నష్టానికి అమ్ముకోవడం ఎప్పుడూ మంచిది కాదు. చెప్పిన ధరకు తగ్గించిన ధరకు మధ్య ఎక్కువ అంతరం ఉంటే వినియోగదారుడు సంతోషపడతాడు. నిజానికి అమ్మకం విలువకన్నా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండే ఉత్పత్తులను నిలిపి వేయడం ఉత్తమోత్తమం. ఏ కొనుగోలుదారుడైతే తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తాడో, ఎక్కువగా బేరమాడుతాడో, అనుకున్న సమయానికి సొమ్ము చెల్లించడో అలాంటి కొనుగోలుదారును వదిలించుకోవడం ఉత్తమం. అలాగే, వివిధ విభాగాలలో కనిపించే అంచనాలకు మించిన వ్యయాన్ని నియంత్రించాలి. అది ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది. నిజమైన నిబద్ధత కలిగిన కొనుగోలుదారులతో సంబంధాలను పెంపొందింప చేసుకోవాలి. అవకాశం ఉన్న విభాగాలలో బయటి వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ చేయడం వల్ల ముఖ్యమైన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాడనికి సమయం లభిస్తుంది.
వ్యాపార అవకాశాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. నూతన ఆవిష్కరణలపై దృష్టి నిలపాలి. అంతేకాదు, ఉత్పత్తులలో నాణ్యతను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. విపణి వీధిలో నిరంతరం ఉండాలి. అమ్మకపుదారులను నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. కొత్త ప్రదేశాలను వెతకాలి. అలా కాక ఒకప్పుడు చురుకుగా ఉంటూ, మరొక సమయంలో మందకొడిగా వ్యాపారం చేసే వ్యాపార వేత్తను ఎవరూ పట్టించుకోరు. ఇవన్నీ వ్యాపార రంగంలో అవసరమైన ఆయుధాలను సమకూర్చుకున్న నాయకుడు ఎప్పుడూ అపజయం పాలు గాడు. అయితే, ఇలా అవసరమైన ఎన్నో అంశాలు అందుబాటులో ఉన్నా సరైన ప్రేరణ లేకపోతే ముందుకు సాగడం కష్ట సాధ్యమవుతుంది. కాబట్టి, తానూ ప్రేరణ పొందాలి. తనతో పని చేసే బృందానికీ ప్రేరణను అందివ్వాలి. అలాంటి సింహాల వంటివారి నాయకత్వంలో కుందేళ్ల సైన్యమైనా విజయాన్ని సాధిస్తుంది.