నాయకద్వయం హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన శతకాలతో కదంతొక్కిన వేళ.. సొంతగడ్డపై టీమిండియా విశ్వరూపం కనబర్చింది. పరుగుల వరద పారిన పోరులో దుమ్మురేపిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికాపై సిరీస్ పట్టేసింది. కొండంత లక్ష్యఛేదనలో కడవరకు కొట్లాడిన సఫారీ అమ్మాయిలు.. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయలేక చతికిలబడ్డారు. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లో పూజ వస్త్రాకర్ ప్రొటీస్ హిట్టర్లను అడ్డుకొని జట్టును విజయ తీరాలకు చేర్చింది. లారా వాల్వర్ట్, మరీనే కాప్ సెంచరీలు వృథా అయ్యాయి.
బెంగళూరు: శతకాల జోరు సాగిన పోరులో టీమిండియాను అదృష్టం వరించింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలచుకున్న భారత్ 2 సిరీస్ పట్టేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరగిన పోరులో ఇరు జట్ల నుంచి ఇద్దరేసి బ్యాటర్లు శతకాలు చేయడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన వైస్ కెప్టెన్ స్మృతి మంధన (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి మూడంకెల స్కోరు అందుకోగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కింది. షఫాలీ వర్మ (20; 3 ఫోర్లు), హెమలత (24; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. చిర్వలో రిచా ఘోష్ (13 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరును మరింత పెంచింది. సఫారీ బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులకు పరిమితమైంది.
కెప్టెన్ లారా వాల్వర్ట్ (135 బంతుల్లో 135 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), మరీనే కాప్ (94 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అరుంధతి రెడ్డి, స్మృతి మంధన ఒక్కో వికెట్ తీశారు. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా గెలుచుకోగా.. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది.