calender_icon.png 2 October, 2024 | 6:05 AM

ఢిల్లీకి వెళ్లే నేతలకు గల్లీలో తిరిగే తీరిక ఉండదు

02-10-2024 01:30:43 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): జంట నగరాల్లో పర్యటించి నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 23 సార్లు ఢిల్లీకి వెళ్లారని, తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక మాత్రం ఆయనకు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఎక్స్‌వేదికగా స్పంది స్తూ ఐదు లక్షల మంది రైతులు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని, 67 లక్షల మందికిపైగా రైతులు రైతుబంధు కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతు లు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పాలన పుణ్యమా అని ఈ దసరాను తెలంగాణ ప్రజలు ఘనంగా చేసుకునే పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్ గుండాలకు బెదరం 

మూసీ నది బాధితుల సమస్యలపై అక్కడికి వెళ్తి తనపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడికి భయపడే ప్రసక్తేలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదని, తాట తియ్యడానికి ప్రజల వద్దకు వచ్చినట్టు తెలిపారు. ఆయన పిల్లికూతలకు వెనకడుగు వేసే నాయకులు తెలంగా ణలో ఎవరు లేరని, ఉద్యమాల పిడికిలి తనది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తనపై గుండాల దాడి మూసీ బాధితుల పట్ల పోరాటం చేసేందుకు మరింత శక్తినిఇచ్చిందన్నారు.