calender_icon.png 24 October, 2024 | 4:52 AM

నాయకులకు కావాల్సింది ‘గుండె బుక్’

24-10-2024 02:47:18 AM

  1. వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా
  2. ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు
  3. మహిళలకు ప్రాధాన్యత లేదంటూ ఆరోపణ

అమరావతి, అక్టోబర్ 23: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే వైసీపీకి షాక్‌ల షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ తన ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారని ఆమె ఆరోపించారు.  వైసీపీలో మహిళలకు ప్రాధాన్యత లేదన్నారు.

తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీ కోసం పని చేసినట్టు వివరించారు. వైసీపీ ప్రభుత్వం  రాష్ట్రంలోని మహిళ భద్రత విషయంలో కూడా విఫలమైందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగినట్లు గుర్తు చేశారు. అఘాయిత్యాలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినా కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

సీఎం హోదాలో జగన్ బాధితులను ఎప్పుడూ పరామర్శించలేదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను జగన్ రాజకీయంగా వాడుకోవడం బాధాకరం అన్నారు. వైసీపీ అధినేత ‘గుడ్ బుక్’ పేరిట మరోసారి ఆ పార్టీ నేతలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు.

నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు ‘గుండె బుక్’ అని హితవు పలికారు. నియంతృత్వ పోకడలను ప్రజలు సహించరనే విషయం ఎన్నికల తీర్పు ద్వారా స్పష్టమైందన్నారు.