28-04-2025 05:33:04 PM
నల్గొండ,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటలాంటిదని, భవిష్యత్ లోనూ కాంగ్రెస్ ను సమర్థంగా నడిపించే నేతలు నల్గొండ జిల్లాలో ఉన్నారని పేర్కొన్నారు. నల్గొండ పట్టణాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అద్భుతంగా తీర్చితిద్దుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. డిండి, ఎదుల ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్లపాటు పట్టించుకోలేదని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నల్గొండ జిల్లా నాయకులం ముక్తకంఠంతో మద్ధతు తెలుపుతున్నామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పదేళ్లపాటు కేసీఆర్ పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులను ప్రారంభించిన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని మంత్రి వివరించారు. ఇప్పటికైనా ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు.
ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రజలు సహకరించాలని, రైతులను ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టులకు భూసేకరణ చేపడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ వరకు పొడిగిస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, పూడిక వల్ల ఆ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎస్పీలో పూడిక తీసి నీటినిల్వ సామర్థ్యం పెంచుతామని, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్-2 పనులను పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సమస్య తీరుతుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న ఓ కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, అవినీతితో దివాలా తీయించారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని, నేతల కమీషన్ల కక్కుర్తి వల్లే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపించి మూడేళ్లలోనే కూలిపోయిందని విమర్శించారు.
రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి కాళేశ్వరం పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు చేశారని, రూ.లక్ష కోట్ల ఖర్చు చేసిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకుని రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, తెలంగాణ రాష్ట్రానికి ఆ జలాలు సరిపోవని 500 టీఎంసీలు కేటాయించాలని ఈ ప్రభుత్వం పోరాడుతోందన్నారు. కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే అదనంగా ఒక్క ఎకరం కూడా సాకులోకి రాలేదని, కేసీఆర్ దోపిడీ విధానం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకపోగా ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యులను కూడా చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తోందని, అధిక ధరకు సన్నవడ్లు కొని రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భం వెల్లడించారు.