calender_icon.png 6 April, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధాలు వీడండి

06-04-2025 01:20:29 AM

  1. జనజీవన స్రవంతిలో కలవకుంటే దాడులు తప్పవు
  2. మావోయిస్టులకు హోంమంత్రి అమిత్‌షా హెచ్చరిక 
  3. 2024లో 8౮1 నక్సల్స్ లొంగుబాటు
  4. ఈ ఏడాది ఇప్పటికే ఆయుధాలు వీడిన 521 మంది

రాయ్‌పూర్, ఏప్రిల్ 5: ఆయుధాలు వీడి, జనజీవన స్రవంతిలో కలవాలని లేకపోతే దాడులు తప్పవని మావోయిస్టులను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఆయన శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పాండమ్ పండుగ ముగింపు వేడుకల్లో మా ట్లాడుతూ.. ‘2024లో 881 మంది మావోయిస్టులు లొంగిపోగా..

ఈ ఏడాది ఇప్పటి వరకు 521 మంది నక్సల్స్ ఆయుధాలను విడిచిపెట్టారు. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని ఆయుధాలతో ఆపలేరు. ప్రస్తుతం బస్తర్‌లో బుల్లెట్ల చప్పుడు, బాంబుల మోత ఆగిపోయింది. నేను నక్సలైట్ సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి. మీరు కూడా మాలో భాగమే. నక్సలైట్లు మరణిస్తే ఏ ఒక్కరు కూడా సంతోషపడట్లేదు.

మీ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి. టెండు (తునికాకు) ఆకులను ప్రభుత్వమే నేరుగా గిరిజనుల నుంచి సేకరిస్తుంది. వారికి మునుపెన్నడూ లేని విధంగా మంచి ధరను అందిస్తుంది. ఇదో చారిత్రాత్మక నిర్ణయం. వచ్చే చైత్ర నవరాత్రి వరకు బస్తర్ గడ్డపై మావోయిస్టులు లేకుండా చేస్తామని నేను మాటిస్తున్నా’ అని అన్నారు. 

దంతేశ్వరి ఆలయంలో పూజలు

ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా బస్తర్ రీజియన్‌లో ఉన్న 14వ శతాబ్దానికి చెందిన దంతేశ్వరి ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సందర్శించారు. చైత్ర నవరాత్రుల చివరి రోజు సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎంలు అరుణ్, విజయ్ శర్మలతో కలిసి షా పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్న అమిత్ షా అనంతరం దంతేవాడలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమం ‘బస్తర్ పండుమ్’ ముగింపు వేడుకలకు హాజరయ్యారు.

యాంటీ నక్సల్ ఆపరేషన్లలో పాల్గొన్న కమాండర్లతో షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్కడ దాదాపు 350 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.