25-03-2025 12:49:57 AM
ఎల్బీనగర్, మార్చి 24: చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... అడ్వకేట్ ఇజ్రాయిల్ ఎర్రబాపు ఇంటిలో కిరాయి ఉండే ఓ మహిళను దస్తగిరి అనే ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురి చేశాడు. ఆ విషయంపై ఇజ్రాయిల్ మహిళ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కారణంతో కక్ష కట్టిన దస్తగిరి సంతోష్ నగర్ లోని న్యూ మారుతి నగర్ కాలనీలో అడ్వకేట్ ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన లాయర్ ఇజ్రాయిల్ ను అపోలో దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య తర్వాత దస్తగిరి ఐఎస్ ఆర్ పోలీస్ స్టేషన్లలో లొంగిపోయాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆందోళన లాయర్ ఇజ్రాయిల్ హత్యపై రంగారెడ్డి జిల్లా కోర్టు లాయర్లు భగ్గుమన్నారు. హత్యను నిరసిస్తూ కోర్టు విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితురాలి తరపున న్యాయం కోసం వాదిస్తున్న లాయర్ ను హత్య చేయడం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.