మణుగూరు మేజిస్ట్రేట్ సూరి రెడ్డి...
మణుగూరు (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో బాలికలకు రక్షణ కవచముల చట్టాలు ఉన్నాయని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కె సూరి రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు పట్టణంలోనే బ్రహ్మంగారి గుట్ట ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ మొత్తాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం నూతనంగా నిర్మిస్తున్న డార్మెటరీ భవన నిర్మాణ పనుల గురించి ప్రిన్సిపాల్ రాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారులకు తెలిపారు.
పాఠశాల ఆవరణలో కానీ బయట సమాజంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే బాలికలకు రక్షణగా చట్టాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సదస్సులో మణుగూరు న్యాయవాదులు బాలికల కోసం ప్రత్యేకంగా ఉన్న పోక్సో, వ్యక్తిగత నిర్వహణ కోసం మెయింటెనెన్స్ కేసుల గురించి వివరించారు. పాఠశాలలో సీనియర్లు జూనియర్లపై వేధింపులకు పాల్పడితే అందుకోసం ప్రత్యేకంగా ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేదరమెట్ల శ్రీనివాసరావు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంకం సర్వేశ్వరరావు న్యాయవాదులు కే విజయ్ భాస్కరరావు పద్మావతి సాయి మోహన్ కోర్టు కానిస్టేబుళ్లు కిషోర్ బుచ్చిబాబు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు ప్రతిభ, కావ్య, సరస్వతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.