మహబూబ్ నగర్, జనవరి 7 (విజయ క్రాంతి) :వృద్ధుల సంక్షేమానికి అవసరమైన చట్టాలు అందుబాటులో ఉన్నాయని అవసరాన్ని బట్టి చట్టాలను వినియోగించుకొని సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ; జిల్లా కార్యదర్శి డి .ఇందిరా అన్నారు. మంగళవారం నవాబ్ పేట మండల సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తల్లితండ్రుల,వృద్ధుల పోషణ, సంరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, ప్రధానంగా 2007 లో రూపొందించిన చట్టం ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రుల పోషణ భారాన్ని భాద్యతగా తీసుకోకపోతే ఇచ్చిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవచన్నారు. వృద్ధులు తమ శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేందుకు న్యాయ సేవా అధికార సంస్థ అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
న్యాయ సలహాలు, సూచనలకు జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సదన్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరినా బేగం, ఫోరం అధ్యక్ష, కార్యదర్శు లు జగపతిరావు, నస్కంటి నాగభూషణం, మండల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చిగుళ్ళపల్లి నర్సింహులు, వెంకటేశ్వరప్ప, మాజీ సర్పం గోపాల్ గౌడ్,ఎ.రాజసింహుడు,శివన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే జీవితంలో మార్పు
విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వస్తుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. మంగళవారం మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవి విద్యాలయాలలో బాల్య వివాహాల పై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు చేసుకుంటే జరిగే అనర్థాలు, బాలలకు ఉండే హక్కుల గురించి, భాధ్యత ల గురించి, ప్రాథమిక; విద్యా హక్కు చట్టాల గురించి బాల కార్మికుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.