07-03-2025 01:58:20 AM
న్యాయపరమైన చిక్కులు లేకుండా ముసాయిదా బిల్లుకు మెరుగులు
కొత్తగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం.. 6 గంటలపాటు సాగిన భేటీ
30వేల ఎకరాల్లో.. నాగార్జునసాగర్ రహదారి మధ్యఫ్యూచర్ సిటీ.. ప్రత్యేకంగా 90 పోస్టులు
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో ఆరు గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
ఎస్సీ వర్గీకర ణతో పాటు బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ ఈ నెల 12 నుంచి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖ లో కూడా ఉద్యోగాల భర్తీతో పాటు భూ భారతి చట్టాన్ని ఉగాది పండుగ నుంచి అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపిందన్నారు. వర్గీకరణ అమలు విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుం డా, న్యాయ నిపుణులతో సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. వర్గీకరణకు న్యాయ పరమైన చిక్కులు రాకుండా.. షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఎలాంటి మార్పులు లేకుండానే అసెంబ్లీలో చట్టం చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులతో పాటు 10,950 గ్రామాలకు క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు, కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మం జూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. హెచ్‌ఎండీఏను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి తెలిపారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాల్లో హెచ్‌ఎండీఏ విస్తరించనున్నట్లు చెప్పారు.
ఈ విస్తరణలో 332 రెవెన్యూ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. మహిళల భద్రత కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామీ ణం, అర్బన్ ఏరియాల్లో ఉన్న మహిళా సంఘాలను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని నిర్ణయించామన్నారు.
మహిళా సంఘాల్లో సభ్యుల వయోపరిమితి 60 ఏళ్లు నుంచి 65 ఏళ్లకు పెంచామని, సంఘా ల్లో చేరే మహిళల వయసును 18నుంచి 15 ఏళ్లకు కుదించినట్లు తెలిపారు. టీటీడీ తరహాలో యాదిగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటుకు ఎండోమెంట్ యాక్ట్ సవరణ తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 27 ప్రాంతాల్లో టూరిస్ట్ ప్లేస్‌లను అభివృద్ధి చేసేందుకు టూరిస్ట్ పాలసీకి ఆమోదం తెలిపినట్లు తెలిపారు.
2025 నుంచి 2030 వరకు ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మేలో జరిగే ప్రపంచ మహిళల అందాల పోటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ పోటీల్లో దాదాపు 140 దేశాల నుంచి అతిథులు పాల్గొంటారని, వారికి భద్రతతో పాటు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు అసెంబ్లీలో వేర్వేరు బిల్లులు పెట్టాలని నిర్ణయించారు.
30 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ ..
నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే వరకు 30 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకు 90 పోస్టులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు అర్బన్ తెలంగాణగా, మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణగా నిర్ణయించినట్లు తెలిపారు.
ట్రిపుల్‌ఆర్‌కు రెండు కిలోమీటర్లు బఫర్‌తో ప్యూచర్ సిటీగా మార్చినట్లు చెప్పారు. పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజనలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అఖిలక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. జనాభా మేరకు ఎంపీ సీట్లు పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్నారు.
మరికొన్ని నిర్ణయాలు..
* గందమల్ల రిజర్వారాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయం
* శంషాబాద్ మండలం పెద్ద గొల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం
* పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తిజీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం
* తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులు, 165 అవుట్‌సోర్సింగ్‌తో కలిపి మొత్తం 495 పోస్టులకు ఆమోదం.