calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపె లాఠీచార్జి!

03-04-2025 01:30:01 AM

  1. తాళ్లతో అడ్డుకొని మరీ దాడి 
  2. హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత 
  3. వర్సిటీ భూముల రక్షణకు విద్యార్థుల పోరుబాట
  4. లాఠీచార్జి జరగలేదు: డీసీపీ వినీత్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విక్రయానికి సంబంధించి ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. ఓవైపు విద్యార్థులు, లెక్చరర్లు, మరో వైపు ఆయా పార్టీల నేతలు హెచ్‌సీయూ వద్ద బుధవారం ఆందోళనలు కొనసాగించారు.

విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి విడతలవారీగా హెచ్‌సీయూ మెయిన్‌గేట్ వద్ద నిరసనలు తెలుపుతున్న క్రమంలోనే స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. విద్యార్థులు తప్పించుకోకుండా అడ్డుకొని మరీ వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడిని పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పుచేశామంటూ విద్యార్థులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులకు చెప్పి మరి కాంగ్రెస్‌కు ఓటేయించామని, ఇప్పుడు అనుభవిస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

లాఠీచార్జి జరగలేదు: డీసీపీ వినీత్, మాదాపూర్

హెచ్‌సీయూ వద్ద విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను మాదాపూర్ డీసీపీ వినీ త్‌కుమార్ బుధవారం పరీక్షించారు. పోలీసుల మో హరింపు, చెక్ పాయింట్ల ఏర్పాటు, బయట నుంచి ఎవరూ హెచ్‌యూసీ వద్దకు రాకుండా బందోబస్తు తదితర అంశాలపై హెచ్‌సీయూ వద్ద ఉన్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. వర్సిటీ వద్ద ఎలాంటి లాఠీచార్జి జరగలేదని, విద్యార్థులు మూకుమ్మడిగా బయటకు వస్తుంటే అడ్డుకున్నామని, వారిపై ఎలాంటి లాఠీచార్జి చేయలేదన్నారు. విద్యార్థులను చెదరగొట్టడానికి రూఫ్‌పై మాత్రమే కొట్టారని, అది లాఠీచార్జిగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో సీఎం

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని, అందు కే భూములు అమ్ముతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మై హోమ్ విహం గ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదని, మై హోమ్ విహంగ ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్టయితే సీఎం బుల్డోజర్లు పంపించాలన్నారు.

కానీ మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ ఆ ధైర్యం చేయలేరని కీలకవ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, మూగజీవులపైనే బుల్డోజర్లు ప్రయోగిస్తారని, పెద్దవాళ్లను ముట్టుకోరని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు. 

సిటీని నాశనం చేస్తున్నారెందుకు!: కేటీఆర్

ఐటీ పార్కులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, ప్రస్తుత నగరా న్ని ఎందుకు నాశనం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.

భూ వివాదం మెడకు చుట్టుకోవడంతోనే కాంగ్రెస్ సర్కార్ ఏప్రిల్ 1న ప్రజలను ఫూల్స్‌ను చేయడానికి ప్రయత్నించిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించిందని, ఆ 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్టు డబ్బా కొట్టిందన్నారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోలేదని మంత్రులు దుష్ర్పచారం చేశారని, ఏమాత్రం ఆలోచించేవారికైనా ఈ వాదనలో పసలేదని ఇట్టే తెలిసిపోతుందని ఆయన మండిపడ్డారు. ఓ మంత్రి తన బాస్ (రేవంత్) చెల్లింపు కోటా సీఎం అని అంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు.

ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ

ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్‌రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన తలపిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు విమ ర్శించారు. హెచ్‌సీయూ వర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నా యి. బుధవారం ఉదయం వర్సిటీ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసన కు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు.