calender_icon.png 14 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ ఎఫ్‌డీలకు ఆఖరి ఛాన్స్

08-12-2024 12:16:51 AM

రిజర్వ్‌బ్యాంక్ తన తాజా ద్రవ్య సమీక్షలో కీలక రెపో రేటును 6.5 శాతం అట్టిపెట్టినందున, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్‌లు అందిస్తున్న అధిక వడ్డీ రేట్లు కూడా ప్రస్తుతానికి నిలిచి ఉంటాయి. అందులో సందేహం లేదు. అయితే క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్)ను అరశాతం మేర ఆర్బీఐ తగ్గించినందున, బ్యాంక్‌లు పోటీపడి ఎఫ్‌డీ రేట్లను పెంచబోవని విశ్లేషకులు చెపుతున్నారు.

  • సీఆర్‌ఆర్ తర్వాత ఆర్బీఐ చర్య రేట్ల కోతేనంటున్న నిపుణులు
  • 2025లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు తగ్గే అవకాశం

  • ఆర్బీఐ తాజా సమీక్షలో సీఆర్‌ఆర్ తగ్గింపునకే పరిమితమైనా, జీడీపీ వృద్ధి మందగిస్తున్నందున, త్వరలో రెపో రేట్లను కట్ చేయడం ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల కోత ఉండవచ్చని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హెచ్‌ఎస్‌బీసీ, 100 బేసిస్ పాయింట్ల తగ్గింపును జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నోమురాలు అంచనా వేస్తున్నాయి.  వచ్చే ఏడాది ప్రారంభంలోనే రేట్ల తగ్గింపు ఉంటుందని బాండ్‌బజార్ వ్యవస్థాపకుడు సురేశ్ దారక్ తెలిపారు.

  • త్వరలోనే ద్రవ్యోల్బణం దిగిరానున్నందున, రేట్ల కోతకు మార్గం సుగమం అవుతుందని 2025 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రేట్ల కోతను ప్రారంభిస్తుందని హెచ్‌ఎస్‌బీసీ తాజా రీసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొంది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందని అంచనా వేసింది. రెపో రేటు తగ్గినంతనే బ్యాంక్‌ల డిపాజిట్ రేట్లనూ తగ్గించడం ప్రారంభిస్తాయి. 

ఈ ఎఫ్‌డీలపై తక్షణ ప్రభావం

వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభంకాగానే ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు తగ్గిస్తాయి. ఆర్బీఐ రెపో రేటును కట్‌చేయగానే తొలుత స్వల్ప, మధ్యకాలిక కాలపరిమితుల ఎఫ్‌డీ రేట్లను బ్యాంక్‌లు తగ్గిస్తాయని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గడం తదుపరికాలంలో మొదలవుతుంది. 

ఇదే మంచి తరుణం 

ప్రస్తుతం ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు గత ఏడాదికంటే ఎక్కువగానే ఉన్నాయి. త్వరలో రేట్లు దిగిరానున్నందున, మీ వద్దనున్న మిగులు నిధుల్ని స్వల్ప, మధ్యకాలిక కాలపరిమితులతో కూడిన ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌చేయడానికి ఇది మంచి తరుణమని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో మరికొద్ది నెలలు అధికరాబడిని పొందే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. రిస్క్ తీసుకోదలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎందుకంటే పెద్ద బ్యాంక్‌లకంటే పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో ఎఫ్‌డీ రేట్లు అధికం. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 9 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 9.5 శాతంవరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.  కానీ వాటిలో చేసే డిపాజిట్ రూ.5 లక్షలకు మించకుండా చూసుకోవాలని, ఆ ఎఫ్‌డీలకే డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ లభిస్తుందని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు వివరించారు.