calender_icon.png 27 October, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లష్కర్ బోనాలు ప్రశాంతం

23-07-2024 01:48:55 AM

  • భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత 
  • ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు 
  • పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
  • పాల్గొన్న సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢం ‘లష్కర్ బోనాలు’ ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం రంగం సందర్భంగా మాతంగి స్వర్ణ లత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, బ్యాండు బాజాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. పలువురు భక్తులు బోనాలను సమర్పించారు. లష్కర్ బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుతం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సీఎస్ శాంతికుమా రి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్  పాల్గొన్నారు. 

ఘట్టం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యం లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆలయ ఈవో, ప్రత్యేకాధికారి అన్న పూర్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

సమృద్ధిగా వర్షాలు..

మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి విని పించారు. మట్టి బోనమైనా.. బంగారు బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని చెప్పారు. ఈ సంవ త్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అన్నా రు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతానని పేర్కొన్నారు. తాను సంతోషంగా ఉండడానికి చల్లని శాక పెడుతున్నారు.. ఈసారి కూడా 5 వారాలు పప్పు, బెల్లాలతో శాక పెట్టాలని కోరారు. పంటల సాగు కోసం వాడే రసాయనాలతోనే రోగాలు వస్తాయని, వాటిని తగ్గించుకుంటేనే వ్యాధులు తగ్గుతాయని తెలిపారు. అనంతరం ఆలయం నుంచి రోప్ పార్టీ ద్వారా పోలీసులు సాగనంపారు. ఈ సందర్భంగా పోతరాజులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయంలో అమ్మవారికి గావు పట్టి బలి, నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేశారు. 

అంబారిపై అమ్మవారు..

కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అంబారి (రూపవతి ఏనుగు)పై మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారిని ఊరేగించారు. పోలీసులు ఏర్పాటు చేసిన రోప్ పార్టీ మధ్య అమ్మవారి ఘటం ముందు సాగగా, ఆ తర్వాత అంబారిపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూలైన్లలో నిల్చున్నారు. 

దొంగల చేతివాటం..  

లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం ఆలయ ప్రాంగణంలో, ఊరేగింపులో  పలువురు దొంగలు చేతివాటం ప్రద ర్శించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి న భక్తుల జేబుల్లోని డబ్బులు, మొబైల్స్, వస్తువులను కొట్టేశారు. బందోబస్తు కోసం వచ్చిన ఓ ఎస్సై బైక్, ఓ వ్యక్తి బైక్, 25 మొబైల్ ఫోన్స్, పలువురి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. క్యూలైన్లలో నిల్చున్న సందర్భంలో మోండా మార్కెట్, మహంకాళి పోలీస్ స్టేషన్ల పరిధిలో భక్తులకు సంబంధించిన ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు రిపోర్టర్ల నుంచి సెల్‌ఫోన్, రూ.4 వేల నగదును అపహరించారు. బాధితులు మహం కాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

28న లాల్‌దర్వాజ బోనాలు

ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జూలై 7న ప్రారంభమైన గోల్కొండ బోనాలు, బల్కంపేట అమ్మవారి కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. ఈనెల 28న లాల్‌దర్వాజ బోనాలు జరుగుతాయని, ఆగస్టు 4న బోనాలు ముగుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ దురి శెట్టి తదితరులు పాల్గొన్నారు.

 -మంత్రి పొన్నం ప్రభాకర్