calender_icon.png 11 February, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయం భయం... అప్రమత్తం..!

09-02-2025 03:58:24 PM

11 రోజులుగా కన్నాల-బుగ్గ అడవుల్లోనే పెద్దపులి ఆవాసం ?

నేటికీ నిర్ధారించలేకపోతున్న అటవీ శాఖ 

ప్రభావిత గ్రామాల్లో టెన్షన్ వాతావరణం 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): గత 11 రోజులుగా బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని కన్నాల-బుగ్గ అటవీ సమీప గ్రామాల ప్రజలను పెద్దపులి భయం వీడటం లేదు. కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సమీప గ్రామాలైన బుగ్గ గూడెం, కొత్త వరి పేట, పాత వరిపేట, గుండ్లపాడు, కరిశెలఘట్టం, గోండుగూడెం, లింగధరి గూడెం, అంకుశం, కన్నాల, ఎస్సీ కాలనీ, లక్ష్మీపూర్, గాంధీనగర్, కుంటా రాములు బస్తి, స్టేషన్ పెద్దనపల్లి, దుబ్బగూడెం, సోమగూడెం ట్యాంక్ బస్తి ప్రాంతాల్లో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని క్షణక్షణం భయపడుతూ గడుపుతున్నారు. అటవీ అధికారులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు అటవీ ప్రాంతం నుండి తిర్యాణి అడవుల గుండా బెల్లంపల్లి బుగ్గ అటవీ ప్రాంతానికి వచ్చిన ఈ పెద్ద పులిని బీ -1 గా గుర్తించి సరిగ్గా ఆదివారానికి 11 రోజులు కావస్తున్నా, అది ఈ ప్రాంతంలో ఎక్కడ ఆవాసం ఏర్పరచుకుందన్న విషయాన్ని పసిగట్ట లేక పోతున్నారు.

మూడు నెలల కిందట కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ పరిసర అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి బుగ్గ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తుంది. అప్పటినుండి బుగ్గ గూడెం ప్రాజెక్టు పరిసరాల్లో తిరుగుతూ కన్నాల అటవీ ప్రాంతాన్ని తన జీవనానికి అనుకూలంగా మార్చుకుంది. కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో మెండుగా ఆహారం, సమృద్ధిగా నీటి వనరులు ఉండడంతో ఈ అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకొని చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో సంచరిస్తుంది. 11 రోజులుగా పెద్దపులి తన కదలికల ద్వారా  అటవీ అధికారులకు, సమీప గ్రామాల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతానికి గ్రామాలు ఆనుకొని ఉండడంతో ఎక్కడ పెద్దపులి గ్రామాల్లోకి వస్తుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. గత నెల 30  నుండి ఈనెల 9 వరకు బుగ్గ రహదారి, పెద్దనపల్లి, దుబ్బ గూడెం, బుగ్గ గూడెం, కొత్త వరిపేట, బుగ్గ దేవాలయం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలికలకు సంబంధించిన పాదముద్రలను సేకరిస్తుండడం బట్టి ఈ ప్రాంతాన్ని పెద్దపులి తన ఆవాసంగా ఏర్పర్చుకుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇక ఇప్పట్లో పెద్దపులి కన్నాల-బుగ్గ అడవులను వీడే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలను గుర్తిస్తున్నప్పటికీ అటవీ అధికారులు కనీసం మీడియాకు కూడా స్పష్టం చేయడం లేదు. అడవి ప్రాంతాల్లో పాదముద్రలు,పెద్దపులి వన్యప్రాణులపై దాడి చేసి చంపిన సంఘటనల ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసే దిశగా కథనాలను అందించాల్సిన పరిస్థితి తప్పడం లేదు. 11 రోజులుగా అటవీ శాఖ అధికారులు,సిబ్బంది మాత్రం పులి అడుగుజాడల ఆధారంగా కదలికలను పసిగడుతూ పెద్దపులికి ఎవరి నుండి హాని జరగకుండా అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్దపులిని బంధించి సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన ఎక్కడా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. 11 రోజులుగా కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని పెద్దపులి సంచరిస్తున్నప్పటికీ దాని ఆవాస ప్రాంతాన్ని మాత్రం ఇప్పటివరకు గుర్తించలేకపోయారు.

ప్రస్తుతం కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలోని 10 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తున్న బీ1 పెద్దపులి గర్భవతిగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం ద్వారా తెలుస్తుంది. మూడు నెలల వ్యవధిలోనే పెద్దపులి సంతానోత్పత్తి జరిపే అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంటుంది. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్దపులిని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా కేవలం దాని సంరక్షణ పైనే దృష్టి పెడితే మాత్రం కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో నే పెద్దపులి పులి పిల్లలను ప్రసవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన బుగ్గ అటవీ ప్రాంతం పెద్దపులులకు ఆవాస ప్రాంతంగా మారిపోతుంది.  పెద్దపులిని సురక్షిత ప్రాంతానికి తరలించేలా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అటవీ గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఏది ఏమైనా పెద్దపులి కదలికలతో బుగ్గ అటవీ ప్రాంతంలో భయానక వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది.