* పహాడీషరిఫ్ లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
* నలుగురి అరెస్టు, ఇద్దరు పరారీలో
* 7860 కిలోల నిషేధిత నల్ల బెల్లం, 40 కిలోల పట్టిక పట్టివేత
ఎల్బీనగర్, జనవరి 22 : తెలంగాణను సారాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పహాడీషరిఫ్ పరిధిలో భారీస్థాయిలో నల్లబెల్లం, పట్టికను స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురిని అరెస్టు చేశారు.
ఎక్సైజ్ కమిషనర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన శివకాంత్, కేతావత్ అరుణ్ నాయక్, సభవాత్ హీరాసింగ్, మహమ్మద్ బాబా, రామవాత్ నరేశ్, కేతావాత్ శ్రీను నాయక్ వీరు కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ ప్రాంతానికి నిషేధిత నల్ల బెల్లం, పట్టికను అక్రమంగా తరలిస్తున్నారు.
ఇక్కడి ఒక గోదాంంలో నిల్వ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి గోదాంపై దాడి చేశారు. డీసీఎం, రెండు ఆటో ల్లో నిషేధిత నల్ల బెల్లం, పట్టికను ప్రొహబిషన్, ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకుని సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధికారి కిషన్ వివరాలు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి 12 లక్షల 50 వేల రూపాయల విలువజేసే 7860 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల పట్టిక, ఒక డీసీఎం, రెండు ఆటోలు, రూ. లక్ష 7 వేల నగదు, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ కేసులో శివకాంత్, కేతావత్ అరుణ్ నాయక్, సభవాత్ హీరాసింగ్, మహమ్మద్ బాబాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మరో ఇద్దరు రామవాత్ నరేశ్, కేతావత్ శ్రీను నాయక్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. గుడుంబా రహిత తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా ఫిబ్రవరి వరకు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కిషన్, జీవన్ కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.