యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన అడ్రినల్ కణతిని లాప్రోస్కోపిక్ పద్ధతిని ఉపయోగించి రోగి ప్రాణాలను రక్షించామని హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యుడు, యూరాలజిస్ట్ రాంప్రసాద్‌రెడ్డి శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌కు చెందిన నాంపల్లి మానస(31) ఎడమవైపు కడుపునొప్పితో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది చివరకు మా వద్దకు వచ్చింది. పలు పరీక్షలు చేశాక ఆమె ఎడమ అడ్రినల్ గ్రంథిలో కణతిని గుర్తించాం.
ఇది 14 సెంటీమీటర్లుగా ఉండి స్ప్లీన్ ప్యాంక్రియాస్, ఎడమ కిడ్నీకి అతుక్కొని ఉన్నది. అందువల్ల మూడు గంటల పాటు శ్రమించి కణ తిని తొలగించి ఆపరేషన్ విజయవంతం చేశామన్నారు. రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని చెప్పారు. యూరాలజిస్ట్ రాంప్రసాద్‌రెడ్డితో పాటు వైద్యులు అభినయ్, ప్రభు రామ్, అనస్తీషియా వైద్యులు సామ్రాట్ ఈ సర్జరీలో పాల్గొన్నారు.