రామగుండం , జనవరి 24 (విజయ క్రాంతి): సింగరేణి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎట్టకేలకు స్థానచలనం కల్పిస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇటీవల విజయక్రాంతి దినపత్రికలో ‘పాతుకు పోతున్న సూపర్‌వైజర్లు... ‘ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
దీనిపై సింగరేణి యాజమాన్యం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది నవంబర్లో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో సివిల్ డిపార్ట్మెంట్లలో లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్న 14 మంది సీనియర్ సివిల్ సూపర్వైజర్ లను బదిలీలు చేస్తూ కొత్తగూడెం ఏరియా పర్సనల్ జిఎం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయా ఏరియాలలో బదిలీలు సక్రమంగా జరగగా, ఆర్ జి -1 ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో బదిలీ అయిన ఇద్దరు సూపర్‌వైజర్లు రిలీవ్ ఆర్డర్లు తీసుకోకుండా ఇక్కడే విధుల్లో కొనసాగుతూ వచ్చారు. సివిల్ జిఎం బదిలీ ఉత్తర్వులను బేకాతర చేస్తూ పై అధికారులను మచ్చిక చేసుకుని ఇక్కడే కొనసాగేలా ముమ్మర ప్రయత్నాలు చేశారు.
దీంతో ఈ ఏరియాలోని సివిల్ కార్మికుల నుంచి అనేక విమర్శలు వెలువత్తాయి. ఈ నేపథ్యంలో విజయ క్రాంతి దినపత్రికలో ఇక్కడి పరిణామాలపై ప్రత్యేక కథనం ప్రచురించగా అధికారులు స్పందించి తమ తప్పులను సరిదిద్దుకునే చర్యలకు ఉపక్రమించారు.
ఈ విషయమై అర్జీ -1 సివిల్ కార్యాలయం అధికారిని వివరణ కోరగా, సదరు సూపర్వైజర్లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. విజయ క్రాంతి కథనం పట్ల సివిల్ డిపార్ట్‌మెంట్ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.