calender_icon.png 22 January, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ యోగ్యత లేని భూములు 18163 ఎకరాలు

22-01-2025 01:55:14 AM

గ్రామ సభల ద్వారా మరింత పెరిగే అవకాశం

కరీంనగర్, జనవరి 21 (విజయక్రాంతి): రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12 వేలు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యోగ్యత భూములకే ఈ భరోసా అందించాలని సర్వే నిర్వహించింది. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు.

కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 207 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ ద్వారా 76 బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 18,163 ఎకరాల భూములు యోగ్యత లేని భూములుగా గుర్తించారు. ఈ సర్వే సోమవారం వరకు కొనసాగింది.

మంగళవారం నుంచి నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో మరిన్ని వివరాలు అందే అవకాశం ఉంది. గతంలో 3.55 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందేది. అది తగ్గనుంది. గత ప్రభుత్వం 2023 వానాకాలం పంటకుగాను 2,00,0075 మంది రైతులకు 5 వేల చొప్పున 187 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించింది. యాసంగిలో 2,03,096 మంది రైతులకు 182 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించాలని భావించారు.

అయితే ఇందులో 1,90,826 మంది రైతులకు 177 కోట్ల పెట్టుబడి సాయం అందింది. గతంలో అందించిన విధానాన్ని తీసుకుంటే జిల్లాలో 3.55 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు 18,163 ఎకరాలను వ్యవసాయ యోగ్యత లేని భూములుగా గుర్తించింది. దీంతో పెట్టుబడి సాయం అందే రైతుల సంఖ్య తగ్గనుంది.

 ధరణి పోర్టల్ ఆధారంగా...

వ్యవసాయాధికారులు ధరణి పోర్టల్ ఆధారంగా సర్వే నిర్వహించారు. గ్రామ పంచాయతీ, నగరపాలక, ఇతర శాఖల రికార్డుల ఆధారంగా సాగుకు యోగ్యంకానీ భూములను సర్వే చేశారు. క్లస్టర్ల వారీగా ఈ సర్వే కొనసాగింది.

ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్, లే అవుట్లు, పరిశ్రమలు, గనులు, ప్రభుత్వం సేకరించిన భూములు, గుట్టలు, కొండలు, రాళ్లు, బావులు, ఫాంహౌజ్ భూములను గుర్తించి 18,063 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేనివిగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 76 వ్యవసాయ క్లస్టర్ల ఉన్నాయి. క్లస్టర్కు 5 వేల ఎకరాల చొప్పున విభజించి సర్వే చేశారు.

అయితే మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ, వార్డు సభల ద్వారా వ్యవసాయ యోగ్యత లేని భూముల సంఖ్య పెరగనుంది. కరీంనగర్ జిల్లాలో వందకుపైగా ఫాంహౌజ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నాయి. అవి రికార్డుల్లోకి ఎక్కితే సంఖ్య పెరిగే అవకాశం ఉంది.