06-03-2025 12:13:37 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): భూములు అమ్మితేకాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రూ.30 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం హైదరాబాద్‌లో విలువైన భూములను అడ్డికిపావుశేరు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బ్యాంకులో తనఖా పెట్టిన భూముల నే వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలో ఉన్న 400 ఎకరాల భూము లను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పి న రేవంత్, ఊసరవెల్లి కంటే వేగంగా మాట మార్చారని కేటీఆర్ వాపోయారు.
మూసీ ప్రక్షాళన, హైడ్రా మూసీ కూల్చివేతల వంటి తలాతోకలేని విధానాలతో రాష్ట్రఆదాయం తగ్గిందని, దాంతో ప్రభుత్వ భూములను అమ్ముకుంటే కానీ ఆదాయం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సర్కార్ దిగజారిం దన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామని కేటీఆర్ చెప్పారు.
దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణ ప్రగతిని కేవలం 15 నెలల కాలంలోనే తిరోగమనబాట పట్టించిన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ అని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు వేసి.. నేడు అందినకాడికి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దగాకోరునైజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.