- రెచ్చిపోయిన మావోయిస్టులు
- భద్రతా బలగాల వాహనం తునాతునకలు
- 9 మంది జవాన్లు మృతి
- 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
బీజాపూర్, జనవరి 6: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతాకానికి తొమ్మిది మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. సోమవారం మధ్యా హ్నం 2.15గంటల ప్రాంతంలో జిల్లాలోని బెద్రే-కుత్రు రోడ్డులో మందుపాతర పేలింది.
దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ సంయుక్త ఆపరేషన్ ముగించుకుని డీఆర్‌జీ(జిల్లా రిజర్వ్ గార్డ్) సిబ్బంది తిరిగి బేస్ క్యాంపునకు వస్తుండగా ఈ దాడి జరిగినట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే.. మావోయిస్టులు మందుపాతర(ఐఈడీ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేల్చారు.
దీంతో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. బలగాల వాహనం తుక్కుతుక్కైంది. ఈ మందుపాతర పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. 8 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, డ్రైవర్ మృతిచెందారు. మిగతా క్షతగాత్రులకు బీజాపూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. శనివారం అర్ధరాత్రి బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఓ కానిస్టేబుల్ చనిపోయాడు.
ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా, త్వరలోనే ఎన్‌ఐఏ బృందం బీజాపూర్‌ను సందర్శించనుంది. రాయ్‌పూర్ ఎన్‌ఐఏ శాఖ నుంచి ఈ బృందాన్ని పంపనున్నారు. వీరితో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా హాజరుకానుంది.
సీఎం విష్ణుదేవ్ సాయి సంతాపం..
ఈ ఘటన చాలా బాధాకరమని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. బస్తర్‌లో కొనసాగుతున్న మావోయిస్టు నిర్మూలన కార్యక్రమంతో నిరాశతో పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. జవాన్ల బలిదానాలు వృథా కావని, నక్సలిజాన్ని అంతం చేసేందుకు తమ పోరాటం మరింత బలంగా కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా రూపుమాపుతామన్నారు.
2026మార్చి నాటికి నక్సలిజం నిర్మూలన..
దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామని ప్రకటనలు చేశారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను వేగిరం చేశారు.
దట్టమైన అటవీ ప్రాంతాలను సైతం తమ గుప్పిటకు తెచ్చుకున్నాయి. అయినా కూడా ప్రస్తుత ఘటన జరగడం గమనార్హం. గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. తాజా ఘటనతో మావోయిస్టులపై కేంద్రం మరింత ఉక్కుపాదం మోపే అవకాశాలు ఉన్నాయి.
మృతిచెందిన జవాన్ల వివరాలు..
కోర్సా, బీజాపూర్ జిల్లా బడే తుంగలి గ్రామం
వెట్టి, దంతేవాడ జిల్లా పార్చెలి బండిపర
సుదర్శన్ వెట్టి, దంతేవాడ జిల్లా పో గుమల్నార్ గ్రామం
సుబర్నాథ్ యాదవ్, దంతేవాడ జిల్లా పో ఛోటే తుమ్నార్ గ్రామం
హరీశ్ కొర్రమ్, దంతేవాడ జిల్లా గర్మరి
డుమ్మా మార్కం ఫాదర్ మిస్టర్, దంతేవాడ జిల్లా మడకమిరాస్ గ్రామం
పండరు రామ పోయామ్, దంతేవాడ జిల్లా కవడ్‌గావ్ గ్రామం
బమన్ సోధి, బీజాపూర్ జిల్లా కర్కవాడ గ్రామం
తులేశ్వర్ రాణా(డ్రైవర్), జగదల్‌పూర్ జిల్లా అరపూర్