‘భారత్ ఔట్’ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది. అందుకే తొలిసారి భారత్‌లో ద్వైపాక్షిక పర్యటనకు వచ్చిన ఆయన భారత దేశ భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎప్పటికీ చేయదంటూ దాదాపుగా కాళ్ల బేరానికి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చైనాకు చేరువ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు భారత్ పట్ల తన విధేయతను ప్రదర్శించి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.
గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్ అనుకూలురుగా గుర్తింపు పొందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయి ముయిజ్జు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటినుంచి ఆయన భారత్‌కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు.
ఇదే సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. దీంతో ‘సార్క్’ సభ్య దేశాలైన ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గందరగోళం నెలకొంది. గతంలో భారత్‌నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేవారు. ఈ ఘటన తర్వాత ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’నినాదం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.
దీంతో చాలామంది భారత పర్యాటకులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇది పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరయిన మాల్దీవులకు శరాఘాతంగా మారింది.ఈ వివాదం కొనసాగుతుండగానే ముయిజ్జ చైనా పర్యటనకు వెళ్లివచ్చారు. ఆ దేశంతో రక్షణ, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
మరోవైపు మార్చి 15 లోగా తమ దేశంనుంచి భారత సైన్యాలను ఉపసంహరించుకోవాలని ముయిజ్జ ఒత్తిడి తెచ్చారు.. అందుకు అనుగుణంగా భారత్ తన బలగాలను ఉపసంహరించుకుంది. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పెద్ద మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోమోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ముయిజ్జ అతిథిగా హాజరయ్యారు కానీ ఆ సందర్భంగా ఎలాంటి చర్చలు జరగలేదు.
అయితే నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్న తర్వాత ఆయన స్వరం మారినట్లు కనిపిస్తోంది. ముయిజ్జ భారత పర్యటన ఖరారయ్యాక మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు కూడా.
ప్రస్తుతం మాల్దీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 110 శాతం బయటి రుణాలే ఉన్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముయిజ్జ భారత్‌తో తమ సంబంధాలను పునరుద్ధరించుకునే యత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధాని పరేంద్ర మోదీతో సోమవారం జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఇరుదేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహ సంబంధాలను గుర్తు చేశారు.
తమ ‘నైబర్‌హుడ్ పాలసీ’, ‘సాగర్ విజన్’లో మాల్దీవులది కీలక స్థానమని స్పష్టం చేశారు. మీకు కష్టమొస్తే మేమున్నామంటూ ముయిజ్జకు హామీ ఇచ్చారు.అంతేకాకుండా 400 మిలియన్ డాలర్లను, రూ.3000 కోట్ల కరెన్సీ స్వాప్ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు కూడా మోదీ వెల్లడించారు.తీవ్రమైన నగదు కొరతతో అల్లాడుతున్న మాల్దీవులకు ఇది భారీ ఆర్థిక ఉపశమనమనే చెప్పాలి.
ఈ సందర్భంగా ముయిజ్జ మాట్లాడుతూ ఉదారంగా సాయం అదించిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.తమ దేశంలో పెట్టబడులు పెంచేందుకు భారత్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
భవిష్యత్తులో తమ దేశానికి భారత టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే ముయిజ్జకు భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమయినట్లు కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో అత్యంత దగ్గరి దేశమయిన మాల్దీవులతో సత్సంబంధాలు భారత్‌కు కూడా కీలకమే.