రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు...
ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్న అక్రమార్కులు...
రాజకీయ ఒత్తిళ్లతో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మౌనం...
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తుండడంటో కబ్జాదారుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 63/1 దేవేందర్ నగర్ ఫైజ్-2లో, అంబేద్కర్ నగర్ ఫేజ్-3లో కబ్జాదారులు రాత్రికి రాత్రే ఇళ్లు నిర్మించడం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కూల్చివేయడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ ప్రభుత్వ భూముల పరిరక్షనలో భాగంగా పర్యటించిన రోజు బోడుప్పల్ డబుల్ బెడ్ రూమ్ పక్కనే ఇందిరానగర్ ఫేజ్-2లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.
తిరిగి మరుసటిరోజు రాత్రి ఇంటిని నిర్మించడంతో మేడిపల్లి మండల అధికారులు మరల కూల్చివేశారు. శని, ఆదివారం సెలవు రోజుల్లో ఓ స్థానిక నాయకుడి అండతో రియల్ మాఫియా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చిన్నచిన్న గదులు నిర్మిస్తూ అమాయక ప్రజలకు అమ్మి సొమ్ముచేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మేయర్ అజయ్ యాదవ్ పర్యటించి కొత్తవి నిర్మించవద్దని చెప్పిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి నిర్మాణం పూర్తి చేసి సున్నాలు వేసి వినియోగంలోకి తీసుకోస్తు ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంతోనే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మౌనం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.