calender_icon.png 6 October, 2024 | 8:08 AM

డిసెంబర్ 9 నుంచి భూ పంపిణీ

06-10-2024 12:24:43 AM

నాగార్జునసాగర్ నుంచే శ్రీకారం

దేశానికే ఆదర్శంగా కొత్త ఆర్వోఆర్ చట్టం

అర్హులకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి 

నల్లగొండ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ భూములు పేదలకు పం చుతామని, డిసెంబర్ 9న నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచే ఈ ప్రక్రియను ప్రార ంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

నల్లగొండ జిల్లా తిరుమగిరి(సాగర్) మండలం నెల్లికల్ గ్రామంలో శనివారం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలిసి మంత్రి పర్యటించారు. తిరుమలగిరి మండలంలో భూస మస్యల పరిష్కారానికి చేపట్టిన పైలెట్ ప్రాజె క్టు సర్వే కొనసాగుతున్న తీరు, సమస్యలపై అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.

ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికే ఆదర్శంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2020లో హడావిడిగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం, ధరణి కారణంగా అనేక భూ సమస్యలు ఉత్పన్నమై రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే  రైతుల ఇబ్బందులు తీర్చేందుకు కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణకు ఉంచామని గుర్తు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రజాభిప్రాయంతోపాటు ప్రతిపక్షాల సూచనలు, సలహాలు సైతం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. 

డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ 

తిరుమలగిరిలో చాలామంది రైతుల్లో పట్టాలున్న వారికి భూములు, భూములున్న వారికి పట్టాలు లేవని గుర్తించామన్నారు. 1,300 ఎకరాలకు భోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలున్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. భూముల సర్వే పూర్తయిన తర్వాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

ఇక్కడ అర్హులైన పేదలకు 4 వేల ఎకరాలకు పట్టా లు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తొలి విడతలో 3,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి విడతలవారీగా 5 వేల ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ధ్రువపత్రాలు లేక బ్యాంకులో మార్టిగేజ్‌పై ఉన్న ఇండ్ల రుణాలు వెంటనే మాఫీ చేసి లబ్ధిదారులకే కేటాయించాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు.

గతంలో ఇండ్లు మంజూరై హక్కు పత్రాలు పెండింగ్‌లో ఉన్నవారికి వాటిని అందించేలా గృహ నిర్మాణశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారం చూపేందుకు తిరుమలగి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

అటవీ భూములకు సంబంధించి అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని, అసరమైతే పునరావాసానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. అంతకుముందు రైతులతో జరిగిన ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి పైలెట్ ప్రాజెక్టు సర్వే జరుగుతున్న తీరు, గుర్తించిన సమస్యలు, పట్టా భూములు, అటవీ భూముల వివరాలు మంత్రికి వివరించారు. రైతులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.