10-04-2025 06:44:46 PM
రక్షణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి...
బూర్గంపాడు/అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలో భూవివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టిఎన్టియుసి నాయకుడు కనకమేడల హరిప్రసాద్ తన అనుచరులతో కలిసి రామచంద్రాపురంలోని తమ పూర్వీకుల పట్టాభూమి సర్వేనెంబర్ 190/129 లో ఫెన్సింగ్ వేస్తుండగా రామచంద్రాపురం గ్రామస్తులు వెళ్ళి అది ప్రభుత్వ స్థలం కాబట్టి అందులో ఫెన్సింగ్ వేయొద్దని అడ్డుకున్నారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రక్షణ కోసం వెళ్ళిన సిఐ అశోక్ రెడ్డి ఇరు వర్గాల వారిని వారిస్తుండగా సీఐ ముందే సివిల్ డ్రస్ లో ఉన్న సీఐ గన్ మెన్ రమేష్ ను కొందరు కాంగ్రెస్ నాయకులు కాలర్ పట్టుకుని పిడిగుద్దులతో దాడి చేశారు. వెంటనే తేరుకున్న సీఐ కర్ర చేత పట్టుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ సర్ధుమణిగింది. తమ గన్ మెన్ ఫై చేయి చేసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు.