calender_icon.png 8 January, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎంసీకి భూమి కేటాయింపు చట్టబద్ధమే

07-01-2025 02:06:04 AM

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి ఐదు ఎకరాల భూమి కేటా యించడం సబబేనని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి సోమవారం హైకోర్టులో వాదించారు.

ఐఏఎంసీ ప్రైవేట్ ట్రస్టని, దీనికి ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడం అన్యాయమంటూ దాఖలైన రెండు పిల్స్‌పై జస్టిస్ కే లక్ష్మణ్,  జస్టిస్ కే సుజనలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హేతుబద్ధమేనని, రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అందుకే రాష్ట్రం విధాన నిర్ణయం తీసుకుని భూమిని కేటాయించిందని చెప్పారు.

ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఏఎంసీని ఏర్పాటు చేసినందున ప్రభుత్వం భూమి ఇచ్చిందని చెప్పారు. భూమితోపాటు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇది విధాన నిర్ణయమని, ఈ విషయంలో కోర్టుల జోక్యానికి ఆస్కార పరిధి చాలా తక్కువని చెప్పారు.

ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టు, సచ్చితానంద్ పాండే కేసులో వెలువరించిన తీర్పు ను ఉదహరించారు. ఐఏఎంసీ ట్రస్టీలుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండో ట్రస్టీగా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఉంటారని వివరించారు. సంస్థాగత మధ్యవర్తిత్వా న్ని ఎంచుకునే కక్షిదారులకు మేలు చేయ డం ద్వారా న్యాయపరమైన లావాదేవీలు తగ్గింపునకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ఐఏఎంసీ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సింగపూర్, దుబాయ్, యూకే, అమెరికా వంటి దేశాల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ విధానాలకు మంచి ఆదరణ ఉందని, పురోగతిని సాధిస్తున్న మన దేశంలో కూడా ఆ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతోందన్నారు. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.

మధ్యవర్తిత్వం కీలకం 

మధ్యవర్తిత్వ విధానం ద్వారా కేసులను కక్షిదారులు పరిష్కరిం చుకోవా లనే విధానాన్ని అందరూ ప్రోత్సహించాలని జస్టిస్ కే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హైకోర్టు, మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్‌గా జ్యుడీషియల్ అకాడమీకి ఈ రోజే వెళ్లినట్టు చెప్పారు.

మధ్యవర్తిత్వ అంశాలపై 70 మంది న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఐదు కోట్లు దాటిందని.. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యర్తిత్వం, ఆర్బిట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.