calender_icon.png 8 February, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సేకరణ సమన్వయంతో చేయాలి

08-02-2025 01:13:14 AM

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ జాతీయ రహదారి పనుల పరిశీలన ఆర్డీవో కార్యాలయాల తనిఖీ

జగిత్యాల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జాతీయ రహదారి 63 నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలో గల కోరుట్ల, మెట్పెల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలను సందర్శించి, జాతీయ రహదారి-63 పనులను కలెక్టర్ సమీక్షించారు. 

జాతీయ రహదారి నిర్మాణ పనులలో భాగంగా వ్యవసాయ భూములు, ఇల్లు కోల్పోతున్న వారి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు డివిజన్ల పరిధిలో గల జాతీయ రహదారి పనుల పురోగతి వివరాలను సమీక్షించారు. జాతీయ రహదారి 63 నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు, నివాసమున్న వారు ఏర్పాటు చేసుకున్న వసతులపై ప్రభుత్వం నష్టపరిహారం కింద చెల్లించాల్సిన వివరాలడిగి తెలుసుకున్నారు.

జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి, ఇండ్లు, కట్టడాలు, చెట్లు, బోర్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, వాటికి చెల్లించాల్సిన నష్ట పరిహార అంచనా విలువలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.

ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు జివాకర్’రెడ్డి, శ్రీనివాస్, కోరుట్ల ఎమ్మార్వో ఇటిక్యాల కిషన్, మేడిపల్లి ఎమ్మార్వో వసంత, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.