calender_icon.png 31 October, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టం ప్రకారం భూసేకరణ ఉండాలి

30-07-2024 01:38:13 AM

  • ప్రభుత్వానికి హైకోర్టు సూచన

సికింద్రాబాద్ క్లబ్ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన 22 ఎకరాలు అవసరమైన పక్షంలో క్లబ్‌కు ముందుగా నోటీసులు జారీ చేసి, వారి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతే భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని హెచ్‌ఎండీఏను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎం డీయేకు అనుమతిస్తూ కేంద్రం మార్చి 1న జారీ చేసిన అనుమతులను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారించారు. ప్రతివాదు లకు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హెచ్‌ఎండీఏకు పనులు మొదలుపెట్టడానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసినపుడు సికింద్రాబాద్ క్లబ్ హక్కులను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ భూమిపై కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ ఎస్టేట్ అధికారులకు ఎలాంటి హక్కు లేదని తెలిపారు. ఈ భూమిపై హక్కులను పలు కేసులను ఎదుర్కొని క్లబ్ సాధించిందని గుర్తుచేశారు.

హెచ్‌ఎండీయే తరఫు న్యాయవాది వాదన లు వినిపిస్తూ ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజె క్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. కేంద్రం అనుమతులు మంజూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లు మంజూరు చేస్తూ మార్చి 6న జీవో 34 జారీ చేసిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం సికింద్రాబాద్ క్లబ్ బంగళాను తీసుకోవాల్సి వస్తే చట్ట నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. పిటిషన్ పై విచారణ ముగిసినట్టు ప్రకటించారు.