calender_icon.png 21 September, 2024 | 12:08 AM

భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

20-09-2024 09:47:55 PM

వనపర్తి,(విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలు, రిజర్వాయర్ పనులకు ఇరిగేషన్ శాఖకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలు అయ్యింది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్రాయపాకుల,  కానాయపల్లి పునరావాస కేంద్రాల పురోగతిపై సమీక్షించారు. పునరావాస కేంద్రాలకు తరలించడానికి అవసరమైన స్థలాన్ని సేకరించి లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు.

గణపసముద్రం రిజర్వాయర్ కు సేకరించాల్సిన స్థలానికి అవార్డు పాస్ చేయాలని సూచించారు. తెల్లారాళ్ళ పల్లి, బొల్లారం, శాపూర్, మామిడిమాడా,  కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పెగ్మార్క్ చేసిన భూమికి త్వరగా అవార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. వనపర్తి పట్టణ బాహ్య వలయం రోడ్డుకు అవసరమైన భూసేకరణ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పి.ఎన్. పాస్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం. నగేష్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటేశ్వర్లు,  ఆర్డీఓ పద్మావతి, ఇరిగేషన్ ఎస్. ఈ కేశవరావు, ఈ. ఈ మధుసూదన్, డి. ఈ లు, తహసిల్దార్ కిషన్ నాయక్, ఏడి సర్వే ల్యాండ్ తదితరులు పాల్గొన్నారు.