calender_icon.png 13 January, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ వేగవంతం చేయాలి

13-01-2025 02:19:41 AM

  • మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్

అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

ఖమ్మం, జనవరి 12 (విజయక్రాంతి): ఖమ్మం మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్  నిర్మించేందుకు అవసరమైన భూమిని త్వరగా సేకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం లోని తన నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మున్నేరు నదీ తీరం వెంబడి వాల్ నిర్మాణానికి సంబంధించి సేకరించాల్సిన ప్రైవేట్ భూముల యజమానులతో చర్చించి, భూములను స్వాధీనం చేసుకునే దిశగా తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని సూచించారు.

జనవరి 15 నుంచి భూసేకరణ పురోగతిపై ప్రతి రోజూ  పర్యవేక్షిస్తానని మంత్రి చెప్పారు. జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రోజు వారి పనులు పురోగతితో షెడ్యూల్ రూపొందించి జనవరి 16 నాటికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఈఈ అనన్య, ఆర్డీవో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

భూముల సరిహద్దుల పరిష్కారానికి చర్యలు 

రెవెన్యూ, అటవీ భూ వివాదాల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం తన నివాసంలో రెవెన్యూ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న భూ వివాదాలపై ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ, రెవెన్యూ, అటవీ శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

అసైన్‌మెంట్ పట్టా భూ ముల్లో గత 40 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్నారని, ఆ భూ సమస్యలు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో సర్వే 1,500 ఎకరాలు రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు సమస్య ఉన్నదని, సర్వే ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు.

కాగా జిల్లాలో మైనింగ్ క్వారీ కోసం రెవెన్యూ భూములు ఎక్కడ కేటాయించారు, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం  వంటి అంశాలపై నివేదిక పరిశీలించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిదార్ధ్ విక్రమ్‌సింగ్, ఆర్డీవోలు  నరసింహారావు, రాజేందర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్,  ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

పొంగులేటికి తృటిలో తప్పిన ప్రమాదం 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి 8:30 గంటలకు హనుమ కొండ పర్యటన ముగించుకుని ఖమ్మం వెళ్తుండగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్ర సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండు ఒక్కసారిగా పేలిపోయాయి. కారు అదుపు తప్పి పక్కకు దూసుకుపోయింది.

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, కారును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ప్రమాదం జరిగిన కారును అక్కడే వదిలేసి, ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని ఆయన స్వగృహానికి మంత్రి వెళ్లారు.