calender_icon.png 30 March, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ వద్దా?!

27-03-2025 01:00:22 AM

  1. గచ్చిబౌలి భూమితో హెచ్‌సీయూకు సంబంధం లేదు
  2. రాష్ట్రంలో ఏ మంచి పని చేపట్టినా దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు
  3. ఫోర్ బ్రదర్స్ సిటీ కాదు.. ఫోర్ క్రోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిటీ
  4. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : రాష్ర్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు నిర్మించాలా వద్దా.. అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా అని సీఎం ప్రశ్నించారు.

కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్‌హౌస్‌కు డైరెక్టుగా కాలువలు తీసుకెళ్లింది ఎవరని నిలదీశారు. బుధవారం ముఖ్య మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ, 25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారని.. ఆ భూమితో హెచ్‌సీయూకి ఎలాంటి సంబం ధంలేదని తెలిపారు. ఇప్పటివరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు గెలిచి భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

అయితే ఆ భూమిలో గుంట నక్కలు ఉన్నాయని.. ఆ గుంట నక్కలకి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తు న్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాల నుకుంటున్నామని తెలిపారు. ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచి చేస్తుందని ప్రశ్నించా రు. 

దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు. దేశభద్రతకు సంబంధించిన రాడార్ కేంద్రా నికి పరిహారం తీసుకుని వ్యక్తిగత అజెండాతో తొమ్మిదేళ్లు కొర్రీ వేస్తే తాము అధికారంలోకి వచ్చాక అనుమతులిచ్చామని, ఆర్‌సీఐ లీజు విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశభద్రత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. కంటోన్మెంట్ వద్ద ఎలివేటెడ్ కారిడార్‌కు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం అనుమతులిచ్చిందన్నారు. 

ఫోర్ క్రోర్ తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్ సిటీ..

తెలంగాణ భవిష్యత్ కోసం తాము ఫోర్త్ సిటీని తలపెడితే ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది ఫోర్ క్రోర్ తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్ సిటీ అంటూ సీఎం భాష్యం చెప్పారు. మేం ‘తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తు న్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం.

అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు’ అని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్‌లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించిందే బీఆర్‌ఎస్ వాళ్లని సీఎం విమర్శించారు. కేసులు వేసిన వారిని పార్టీలో చేర్చుకున్నది వాళ్లేనని అన్నారు. 

ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు..

రాష్ర్టంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారని.. కానీ ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని సీఎం అన్నారు. నడిబజారులో న్యాయవాదులు వామన్‌రావు దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని తెలిపారు.

గత పాలనలో సింగరేణి కాలరీలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తే కనీసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ పబ్‌లో అప్పటి ఎమ్మెల్యే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడితే చర్యలే లేవన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020లో దేశంలోనే రాష్ర్టం నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు.

బాధితులపై సానుభూతితో ఉండి నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని, అదే విధంగా తమ విధానం ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించబోదన్నారు. అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాన్ని విమర్శించారు.

15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామని... అప్పుడే మీకు అంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను దెబ్బిపొడిచారు. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని.. ఆ విధంగా తమ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. 

బీఆర్‌ఎస్‌లో వాళ్ల  మధ్య పోటీ రాష్ర్ట ప్రభుత్వానికి తల నొప్పిగా మారుతోందన్నారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు ఎవ రైనా సరే ముఖ్యమంత్రిగా తన దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. చివరకు గజ్వేల్ ఎమ్మెల్యే వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ‘మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవు.

మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదు.. డాంబికాలతో మేం బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ 95 శాతం నిజం కాబోతుంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సిట్

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : ఆన్‌లైన్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మీ, ఆన్‌లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్ గేమ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నదని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో బుధవారం శాంతిభద్రతల అంశంపై ఆయ న సమాధానమిచ్చారు.

కేవలం ఈ యాప్‌లకు ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని.. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ (సిట్) టీమ్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షం గా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల శిక్ష సరిపోదని, అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. డిజిటల్ ప్లాట్‌ఫాం గేమింగ్‌పై తా ము అత్యంత అప్రమత్తంగా ఉంటామని స్పష్టంచేశారు.

వ్యసనాలకు తె లంగాణలో తావులేదన్నారు. రాష్ట్రం లో గుట్కాపై నిషేధం విధించినా విక్రయాలు జరుగుతున్నాయని వీటి పై మరింత కఠినంగా ఉంటామన్నా రు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై చర్యలు లేవని.. ఇప్పుడు అలాంటివి నడవబోవని మీ వాళ్లకు చెప్పండంటూ బీఆర్‌ఎస్ సభ్యులపై సీఎం ఎదురుదాడి చేశారు. 

ఉప ఎన్నికలు రావు..

గతంలో పార్టీమారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా ఉప ఎన్నికలు రాలేదని.. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తా యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఆచరించిన సంప్రదా యాలనే ఇప్పుడు తామూ ఆచరిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై తాను మాట్లాడేందుకు నిబంధనలు అంగీకరించవని తెలిపారు. ఉప ఎన్నికల విషయంలో  సభ్యులెవరూ ఆందోళన చెందవద్దన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావని.. ఎన్నికలు వచ్చేది 2028 లోనేనని సీఎం అన్నారు. ఒకవేళ బీజేపీ వాళ్లు చెప్తున్న జమిలి ఎన్నికలు వస్తే గనుక మరో ఆరు నెలలు ఆలస్యం అయితే అవ్వవచ్చునని చెప్పారు. ఉప ఎన్నికలు రావని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తమ దృష్టి రాష్ర్ట అభివృద్ధిపైనే ఉంటుందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పిం చాలని తాము ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతిపక్షానికి తాము సూచన చేస్తున్నామని.. వారిపై తమకు ద్వేషం లేదన్నారు. వారిని ప్రజలు ఎప్పుడో శిక్షించారని అన్నారు. వారిపై తమకు కోపం ఎందుకు ఉంటుంద న్నారు.

ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ దాడులకు సమయం ఎక్కువ ఇవ్వవద్దన్నారు. క్షణికావేశంలో చేసే యాసిడ్ దాడుల్లాంటి ఆలోచనలతో అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని.. ఎవరు మాట్లాడినా ఇలాం టి వాటిని నియంత్రించాలని సభాపతికి సీఎం విజ్ఞప్తి చేశారు.