03-04-2025 12:09:11 AM
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఢిల్లీకి ప్రయాణించేందుకు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు రాగా ఆరోగ్యం క్షీణించింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు రక్తపోటు ఎక్కువ కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. రొటీన్ చెకప్‌లలో బ్లెడ్ షుగర్ లెవల్స్ ఆందోళనకరంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్టులు రావడంతో తదుపరి చికిత్స కోసం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చనున్నట్టు తెలుస్తోంది.
లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్య చికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ముంబైలో గుండె సంబంధిత సమస్యలతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. దానికి ముందు 2022లో సింగపూర్‌లో ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని ఆయనకిచ్చారు. 2014లో లాలూకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది.