08-03-2025 11:38:06 PM
గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన పసిఫిక్ ద్వీప దేశం..
2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో మొదటి స్థానం..
లండన్: ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవలే పసిఫిక్ ద్వీప దేశం వనువాటు పౌరసత్వం లభించిన సంగతి తెలిసిందే. లలిత్ మోదీకి వనువాటు ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ కింద పౌరసత్వం ఇచ్చింది. దీంతో వనువాటు పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన పేర్లలో వనువాటుకు చోటు దక్కడం విశేషం. మరి వనువాటు కథేంటి.. ఆ ద్వీపానికి ఉన్న ప్రత్యేకతలేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
టాక్స్ ఫ్రీ దేశంగా..
వనువాటు గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకున్న వారికి ఆ దేశం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా వ్యాపారం చేయడం ద్వారా వచ్చే ఆదాయాలపై రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. గోల్డెన్ పాస్‌పోర్ట్ ద్వారా ఒక్కసారి పౌరసత్వం పొందితే అక్రమంగా ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. దీర్ఘకాలిక లాభాలు సహా స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్‌లో లక్షలు సంపాదించిన వాటిపైనా పన్నులు ఉండకపోవడం గమనార్హం. వనువాటులో ఒక కంపెనీ రిజిస్టర్ చేయించి విదేశాల్లో ఉంటూ ఆదాయం పొందినా ఆ దేశం నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కార్పొరేట్, గిఫ్ట్, ఎస్టేట్ లాంటి టాక్స్‌లకు చోటు లేదు. ముఖ్యంగా వనువాటు క్రిప్టో హబ్‌గా అభివృద్ధి చెందుతుండడంతో క్రమంగా ఆ దేశ వీసాకు డిమాండ్ పెరుగుతోంది.
2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో వనువాటు తొలి స్థానంలో నిలవడం విశేషం. ఐపీఎల్ చైర్మన్‌గా వ్యవహరించిన లలిత్ మోదీ 2010లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దేశం విడిచివెళ్లారు. భారత్ వదిలి లండన్ చేరుకున్న అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవలే తన భారత పాస్‌పోర్టును లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంలో అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పందించారు. లలిత్‌కు వనువాటు పౌరసత్వం లభించినట్లు తెలిసిందని, అయితే ఆయనపై కేసులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.