calender_icon.png 26 November, 2024 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌కు లక్ష్యసేన్

22-11-2024 12:00:00 AM

సింధూ ఖేల్ ఖతం చైనా మాస్టర్స్

షెంజెన్ (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ మరోసారి నిరాశపరిచింది. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధూ రెండో రౌండ్‌కే పరిమితమైంది. కాగా పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ సీడ్ లక్ష్యసేన్ మాత్రం క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-6, 21-18తో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కేను చిత్తు చేశాడు.

46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లో గెమ్కే కేవలం ఆరు పాయింట్లకే పరిమితమవ్వడం లక్ష్యసేన్ దూకుడును చూపించింది. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్‌సెన్‌తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జంట 21-19, 21-15తో రాస్మస్-ఫ్రెడ్రిక్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఈ జోడీ క్వార్టర్స్‌లో కిమ్ అస్ర్తుప్-ఆండర్స్ (డెన్మార్క్) జంటను ఎదుర్కోనుంది. మహిళల సింగిల్స్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సింధూ 16-21, 21-17, 21-23తో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది.

మిగిలిన మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ కూడా పరాజయం పాలయ్యారు. డబుల్స్‌లో గాయత్రి-త్రిసా జాలీ జంట ఓటమి చవిచూసింది. అయితే ఈ జోడీ ప్రతిష్ఠాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు మాత్రం ఎంపికయింది.