calender_icon.png 25 November, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20నుంచి లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు

17-05-2024 02:08:45 AM

యాదాద్రి భువగిరి, మే 16 (విజయక్రాంతి): మహిమాన్విత యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు. వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్ధశి వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు 20వ తేదీన ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేడు పూజతో ప్రారంభం అవుతుందని తెలిపారు. అనంతరం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, స్వామివారిని తిరువేంకటపతి అలంకారంలో తిరువీధి సేవ నిర్వహిస్తారు.

రెండో రోజు నిత్య మూలమంత్ర హవనం, స్వామివారికి లక్షపుష్పార్చన, చిన్ని కృష్ణుడి అలంకారంలో తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం నృసింహా ఆవిర్భావ వేడుకలను మూడోరోజు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఉదయం మూలమంత్ర జపాలు, హవనం, మహాపూర్ణాహుతి నిర్వహించి మూలవరులకు సహస్ర కలశాభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం 7గంటలకు స్వామివారి జయంతి ఆవిర్భావ వేడుకలను శాస్త్రోక్తంగా జరుపుతారు. అనంతరం మహానివేదన, ప్రసాదగోష్టితో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా కొండపై మూడు రోజుల పాటు భజనలు, భక్తి సంగీతం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు ధార్మిక, సాహిత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింప చేయనున్నాయి.