చెన్నూర్, నవంబర్ 29 (విజయక్రాంతి): కోటపల్లి ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎంపీవో సత్యనారాయణ అవినీతిపై విజయక్రాంతి దినపత్రిలో ఈ నెల 29న ‘నాటు కోడి కూర.. 2 వేలు మామూలు?’ పేరిట కథనం ప్రచురితమైంది.
దీనిపై స్పందించిన అధికా రులు సత్యనారాయణను ఎంపీడీవో బాధ్యతల నుంచి తప్పిం చి, మరో అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇన్‌చార్జి ఎంపీడీవోగా కాసిపేట మండల ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంటు లక్ష్మయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఎంపీవోపై చర్యలు లేవా?
ఎంపీడీవో బాధ్యతలు నుంచి ఎంపీవో సత్యనారాయణను తొలగించిన అధికారులు విచారణ చేస్తారా, లేదా ఇక్కడికే వదిలేస్తారా అని ఆయన బాధితులు అయోమయంలో పడ్డారు. ఆయన ఇలాగే కొనసాగితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతారని వాపోతున్నారు. ఇంతకుముందు ఇక్కడి నుంచి తాండూరుకు డిప్యూటేషన్‌పై వెళ్లిన సమయంలో అక్కడ పంచాయతీ కార్యదర్శులను సత్యనారాయణ ఇబ్బంది పెట్టారు.
అడిషనల్ కలెక్టర్‌కు కార్యదర్శుల ఫిర్యాదుతో డీఎల్‌పీవోతో విచారణ జరిపించారు. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ఆ విచారణ అక్కడికే ఆగినట్లు సమాచారం. తిరిగి కోటపల్లికి వచ్చిన సత్యనారాయణ పాత పద్ధతినే కొనసాగిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.