మంథని పట్టణంలో ఆత్మీయ సమ్మేళనలో వక్తల పిలుపు....
మంథని (విజయక్రాంతి): ఫిబ్రవరి 7న లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మంథని నియోజకవర్గంలోని మాదిగలు, మాదిగల ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఆదివారం మంథని పట్టణ కేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సందర్భంగా సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగనున్న లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మంథని నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మాదిగ, మాదిగ ఉప కులాల సోదరులు తరలిరావాలని అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మందకృష్ణ మాదిగ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మాదిగలు, మాదిగ ఉపకులాలు సిద్ధం కావాలని ఉద్యమ పోరాట కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రచించడం జరిగిందని, సామాజిక న్యాయమే రిజర్వేషన్లకు పరిష్కారమని, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు మంచి బుద్ధి ప్రసాదించి, రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అనంతరం మాదిగ నాయకులు జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ చేయాలి జై మాదిగ అంటూ నినాదాలు చేసి, ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించే లక్షడప్పులు వేయ గొంతుకుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.