calender_icon.png 22 September, 2024 | 5:05 AM

1.70 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

22-09-2024 12:58:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఓ మహిళను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ భయభ్రాంతులకు గురిచేసి రూ.1.70 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నా యి.. ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళా ఉద్యోగికి ముంబై సైబర్ క్రైమ్ అంటూ ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నంబర్ ఉపయోగించి ముంబైలోని కెనరా బ్యాంకులో ఖాతా తెరిచి రూ. 1 కోటి జమ చేశారని తెలిపారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మొత్తం 24 మంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అరెస్ట్ చేసే అవకాశం ఉందని భయబ్రాంతులకు గురి చేశారు. బాధితురాలు తనకు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా, విచారణ 7 రోజులు కొనసాగుతుం దని అందుకు సహకరించాలని హెచ్చరించారు. విచారణ నిమిత్తం బాధితురాలి ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి పంపిస్తామని చెప్పారు.

ఇదంతా నిజమేనని నమ్మిన బాధితురాలు రూ. 1.70 లక్షలను బదిలీ చేసింది. అనంతరం వారు కేసు విచారణ పూర్తయిందని, కేసుతో మీకు సంబంధం లేదని గుర్తించినట్లు తెలిపారు. కానీ, డబ్బును తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్ పేరిట 1.13 లక్షలు లూటీ

నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల 62968 57591 నంబర్ నుంచి కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డుపై ఇన్సూరెన్స్ చేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయంటూ నమ్మించి, మాయమాటలతో బాధితుడి నుంచి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఓ లింక్‌ను పంపి అది క్లిక్ చేయాలని సూచించారు. లింక్ క్లిక్ చేయగానే బాధితుడి మొబైల్‌కు వచ్చిన ఓటీపీని స్కామర్లు రిసీవ్ చేసుకున్నారు. అలా రెండు లావాదేవీల్లో బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి మొత్తం రూ. 1.13 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. డబ్బు కోల్పోయిన విషయం గమనించిన బాధితుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.