16-03-2025 10:35:49 PM
గజ్వేల్ లో విశ్వా వసు పంచాంగ ఆవిష్కరణ చేసిన ఎంపీ రఘునందన్ రావు...
గజ్వేల్: గజ్వేల్ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.10 లక్షలు అందించనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం గజ్వేల్ లోని సత్యసాయి మందిరంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గనించిన విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఎంపీ రఘునందన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైందవ ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణులకు తన వంతు సేవ చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సంఘం భవన నిర్మానానికి ప్రణాళికలు సిద్ధం చేయించి తనను సంప్రదిస్తే రూ.10 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రాబోయే తెలుగు సంవత్సర పంచాంగంలో తనకు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉందని త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటూ అందరినీ నవ్వించారు. బిజెపి రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ... హైందవత్వానికి పంచాంగమే మూలమని, పంచాంగం ద్వారా లెక్కించే మహాకుంభమేళా లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. పంచాంగాలు మూఢనమ్మకాలు అనేవారి మాటలు తప్పని ఎన్నో శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆధారాలు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డివిజన్ అధ్యక్షులు దేశపతి శంకర శర్మ, సంఘం ప్రతినిధులు ఎంపీ రఘునందన్ రావుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక ఎడిటర్ మరుమాముల వెంకటరమణ శర్మ, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు కోశాధికారి కృష్ణమూర్తి శర్మ యువ పరిషత్ సాయి కృష్ణ శర్మ శ్యామ్ ప్రసాద్ శర్మ మాముదాల రాఘవేందర్ రావు, గజ్వేల్ బిజెపి నాయకులు, బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.