calender_icon.png 12 October, 2024 | 11:47 PM

రైస్ పుల్లింగ్ పేరిట 25 లక్షల టోకరా

10-10-2024 12:00:00 AM

ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రైస్ పుల్లర్ (అతీత శక్తులు కలిగిన రాగి పాత్ర) ఇంట్లో ఉంటే కోటీశ్వరులు అవుతారంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన ముఠాను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర కథనం ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్‌కు చెందిన పగిడిమర్రి శివ సంతోశ్‌కుమార్, ఏపీలోని చిత్తూరుకు చెందిన గుల్లూరు మంజునాథ్‌రెడ్డి, బెంగళూరుకు చెందిన ప్రతాప్ అలియాస్ రవీందర్ ప్రసాద్ ముఠాగా ఏర్పడ్డారు.

రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలని పథకం రచించారు. అందుకు ప్రత్యేకంగా రాగి పాత్రను తయారు చేయించారు. ఈ క్రమంలో వారికి శశికాంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రాగి పాత్రను చూపించి, అది ఇంట్లో ఉంటే కోటీశ్వరుడివి అవుతావని నమ్మించారు. అలా శశికాంత్ నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశారు.

రాగి పాత్ర నాణ్యత తెలుసుకోవడానికి నిపుణుడిని కలవాలని, అందుకు అదనంగా రూ.23 లక్షలు చెల్లించాలని మళ్లీ కోరారు. దీంతో శశికాంత్ మోసపోతున్నట్లు గుర్తించి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు రంగంలోకి దిగి నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.