*బీహార్ సైబర్ ముఠా ఘరానా మోసం
పట్నా, జనవరి 11: పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ.10లక్షలు ఇస్తామని మోసం చేస్తున్న ఓ ముఠాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్ డివిజన్ పరిధి కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ ముఠా సభ్యులు “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్”ను నడిపినట్లు, దీని ద్వారా కస్టమర్లను ఆకర్షించి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. ఆఫర్ ప్రకారం.. పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తే దానికి బదులుగా రూ.10 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టినట్టు తెలిపారు.
ఒక వేళ గర్భవతి కాకుంటే కస్టమర్లకు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఇస్తామని నమ్మించినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లేబాయ్ సర్వీస్‌ను కూడా నడిపినట్లు తేలిందన్నా రు.
డీఎస్పీ ఇమ్రాజ్ పర్వేజ్ మాట్లాడుతూ.. “ఈ ముఠా సభ్యులు ముం దుగా ఫేస్ బుక్ ద్వారా ప్రకటనలు ఇస్తారు..ఆ తర్వాత చాలా మంది వీరికి కాల్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పేరు తో కస్టమర్లకు సంబంధించిన పాన్ కార్డ్స్, ఆధార్, సెల్ఫీని అడుగుతారు.
రిజిస్ట్రేషన్స్, హోటల్ బుకింగ్స్ పేరుతో ఈ ప్రలోభాల ఉచ్చులో పడే వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు..” అని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్ ఉన్నారు.