15-02-2025 12:45:56 AM
ముగిసిన ఎగ్జిబిషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 45 రోజుల పాటు నిర్వహించిన జాతీయ పారిశ్రామిక ప్రదర్శన శుక్రవారం ఘ నంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 విద్యా సంస్థలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.
ప్రస్తుతం డిప్లొమా కోర్సులు ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి ఏడాది 10 వేల మందికి ఉపాథి కల్పిస్తుందన్నారు. సొసైటీ విద్యా సంస్థల్లో 2 వేల మంది టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారన్నారు.
జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్‌లు, యుటిలిటీ ట్యాక్స్‌లు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర రూపాలలో ప్రభుత్వానికి రూ. 13 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. 46 రోజుల పాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌ను దాదాపు 17.46 లక్షల మంది ప్రజలు సందర్శించినట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్నను మంత్రి సత్కరించారు.