calender_icon.png 27 October, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కొట్టు.. బదిలీ ఆర్డర్ పట్టు!

12-08-2024 01:06:31 AM

ఎస్సీ గురుకుల సొసైటీలో టీచర్ల బదిలీల్లో ఓ అధికారి నిర్వాకం

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉండేందుకే ఆసక్తి చూపుతున్న టీచర్లు

కోరుకున్న చోట పోస్టింగ్‌కు ఆమ్యామ్యాలు

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారి సీరియస్

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎస్సీ గురుకుల విద్యాసంస్థలో అక్రమ బదిలీల వ్యవహారం గుప్పుమంటున్నది. ఉపా ధ్యాయుల అవసరాలు ఆసరాగా చేసుకొని ఎస్సీ గురుకుల సొసైటీలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నా యి. ఆయన కొంత మంది టీచర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకున్నట్లు తెలిసింది. కోరుకున్న చోటకు బదిలీ కోసం ఒక్కో టీచ ర్ నుంచి సుమారుగా లక్ష రూపాయల వర కు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచా రం.

ఒకే ప్లేసుకు ఇద్దరు టీచర్లను బదిలీ చేసేందుకు ఆ ఇద్దరి నుంచి డబ్డులు వసూ లు చేసి, చివరికి ఆ ఇద్దరికీ కోరుకున్న చోటు కి బదిలీ ఆర్డర్ ఇవ్వకపోవడంతో వారు కార్యాలయం ముందు ఆందోళన చేసినట్లు తెలిసింది. ఇటీవల ఎస్సీ గురుకుల పాఠశాల ల్లోని ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిర్వహించారు. అయితే కొంత మంది టీచ ర్లు గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో బదిలీలపై రావడానికి ఆసక్తి చూపారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓఅధికారి డిమాండ్‌ను బట్టి ఆయా టీచర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

గ్రామాలకు పోస్టింగులపై అనాసక్త్తి..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలా మంది గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడటంలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన, ఇంకా జరుగుతున్న బదిలీల్లో దూర ప్రాంతాలకు టీచర్లు బదిలీలపై వెళ్లిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలకు వచ్చేందుకు కొంతమంది టీచర్లు ఎస్సీ గురుకుల సొసైటీలోని ఓ ఉన్నతాధికారిని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా ఉపాధ్యాయుల అవసరాలు, కోరుకున్న ప్లేస్‌ను బట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఓ ఉపాధ్యాయ సంఘం నేత ఆరోపించారు. 

హెచ్‌ఆర్‌ఏ కోసమే..

టీచర్ల బాధంతా హెచ్‌ఆర్‌ఏ కోసమే. ఇది ఎవ్వర్ని అడిగినా నిజమే అంటారు. బదిలీల్లో భాగంగా ఎక్కడికి బదిలీ అయినా సదరు ఉపాధ్యాయుడు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, హైదరాబాద్‌లో, చుట్టుపక్కల జిల్లాల్లో ఉండేందుకు మెజార్టీ టీచర్లు ఆసక్తి చూపిస్తారు. ఈ పరిస్థితి కేవలం ఎస్సీ గురుకుల సొసైటీలోనే కాదు, ఇతర సొసైటీల్లోని ఉపాధ్యాయులు, ప్రభుత్వ, లోక్‌బాడీ పాఠశాలల్లోనూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉద్యోగం చేసేందుకే ఇష్టపడతారు.

ఇందులో కొంత మంది తమ పిల్లల చదువుల కోసమని, మరికొంత మంది సిటీ వాతావరణానికి అలవాటు పడి ఇక్కడే ఉండాలనుకుంటారు. ఇంకొందరైతే హెచ్‌ఆర్‌ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు బదిలీపై రావాలనుకుంటారు. మండల కేంద్రం, జిల్లా కేంద్రాల్లో కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా ఇస్తారు. బేసిక్ పేను బట్టి అందులో 24 శాతం ఇస్తారు. అదే 2 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ జిల్లా కేంద్రాల్లోనైతే 17 శాతం ఉంటుంది.

50 వేల నుంచి రెండు లక్షలోపు జనాభా ఉన్న జిల్లాల్లో 13 శాతం హెచ్‌ఆర్‌ఏ, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఈ క్రమంలోనే హెచ్‌ఆర్‌ఏ కోసం ఈ మూడు జిల్లాలకు వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపిస్తారు. అక్కడ కుదరకుంటే ఆ తర్వాత జిల్లా కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం ఉన్న మార్గాలను అన్వేషిస్తుంటారు. కొంతమంది మ్యూచువల్ బదిలీలపై వచ్చేందుకు, మరికొంత మంది పైరవీలు చేసుకొని వస్తారు.  ఈ క్రమంలోనే కొంతమంది టీచర్లు అవసరాలను ఆసరాగా చేసుకొని ఎస్సీ గురుకులాలకు చెందిన ఓ అధికారి కోరుకున్న ప్లేసును ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

వెబ్‌కౌన్సిలింగ్ చేపట్టకుండానే..

టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో వెబ్‌కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే ఆ సదరు ఉన్నతాధికారి కొంతమంది దగ్గరి నుంచి మ్యాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకున్నట్లు ఆరోపణ. అంతేకాకుండా అర్హులైన వారికి వచ్చే ప్లేసును కావాలనే హైడ్ చేసి, కోరుకున్న వారికి ఆ ప్లేసుకు పంపించేందుకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఇలా పదుల సంఖ్యలో ఉపాధ్యాయుల నుంచి వసూలు చేశారని ఓ ఉపాధ్యాయ సంఘం నేత ఆరోపించారు. తీరా కోరుకున్న చోటుకి బదిలీ చేయకపోవడంతో తమ డబ్బులు తమకివ్వాలని ఆ అధికారిని బాధిత ఉపాధ్యాయులు నిలదీసినట్లు సమాచారం.

ఉన్నతాధికారుల జోక్యంతో..

ఆ అధికారి అక్రమ బదిలీల వ్యవహారం ఆ సంస్థ ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆయనపై సీరియస్ అయినట్లు సమాచారం. అక్రమ బదిలీలు జరగకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. అక్రమ బదిలీలపై ఆ ఉన్నతాధికారి ఆరా తీయడంతోపాటు అక్రమ బదిలీలకు ఆస్కారం లేకుండా ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అప్పటికే కొన్ని బదిలీలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అయితే దీనిపై ‘విజయక్రాంతి’ ప్రతినిధి వివరణ కోసం సంస్థ ఉన్నతాధికారిని ఫోనులో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.