calender_icon.png 30 September, 2024 | 6:52 AM

బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు

26-09-2024 03:47:18 AM

  1. 10 వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ముందుకొచ్చిన ఎక్విప్
  2. బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ ప్రోగ్రాంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రానున్న కొద్ది సంవత్సరాల్లోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో 5 లక్షల మంది శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యమున్న వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన బీఎస్‌ఐఎస్(బ్యాంకింగ్, ఫైనాన్షియల్  సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) నైపుణ్య శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ప్రసంగించారు. గత ప్రభుత్వం ఏరోజూ నిరుద్యోగులను ఆకాంక్షలను గుర్తించలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించిందన్నారు. ఆరు నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా శ్రమించి ఈ కోర్సుకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్, ఐఐటీ, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నా బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయన్నారు.

ఇంజినీరింగ్ చదివినా అవకాశాలు దక్కని వారిని దృష్టిలో పెట్టుకొని నైపుణ్య శిక్షణ కోర్సుకు రూపొందించామన్నారు. తాను ఎక్విప్ అనే సాంకేతిక శిక్షణ అందించే సంస్థను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించారన్నారు. సామాజిక బాధ్యత కింద ఎక్విప్ రూ.2.5 కోట్ల వ్యయంతో పదివేల మందికి ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.

డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల ఆఖరి సంవత్సరంలో ఆరు నెలలపాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ , ఇన్స్యూరెన్సు సంస్థలు సంసిద్ధత తెలిపాయని వెల్లడించారు. దీని వల్ల చదువుపూర్తుయ డిగ్రీ పట్టా చేతికి రాగానే ఉద్యో గావకాశాలు దొరుకుతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిమార్గాలను అందిపుచ్చుకోవాలని ఆయన హితవు పలికారు.