calender_icon.png 1 October, 2024 | 7:53 AM

రూ.34.50 లక్షల గంజాయి పట్టివేత

01-10-2024 12:00:00 AM

భద్రాచలం, సెప్టెంబర్ 30: ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న రూ.34.50 లక్షలు విలువజేసే 138 కిలోల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సోమవారం పట్టుకున్నది. భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ మహ్మద్‌ఫరీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్  అసిస్టెంట్ సూపరింటెండెంట్ తిరుపతి తెలిపారు. గంజాయితో పాటు కారు, సెల్‌ఫోన్ సీజ్ చేసినట్టు తెలిపారు. 

6.24 క్వింటాళ్ల గంజాయి నిర్వీర్యం 

ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వివిధ కేసుల్లో పట్టుబడిన ఎండు గంజాయిని సీపీ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పట్టుబడిన   624 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ నరేశ్‌కుమార్ పర్యవేక్షణలో మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేసినట్టు పోలీసులు తెలిపారు.

గంజాయి రవాణాలో బీటెక్ స్టూడెంట్స్

వైరా, సెప్టెంబర్ 30: గంజాయిని తరలిస్తూ ముగ్గురు బీటెక్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ముగ్గురు ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 8.5 కిలోల గంజాయి పట్టుబడింది. ముగ్గురు నిందితులు నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. కేసు నమోదు చేసినట్టు సీఐ మమత, ఎస్సై సాయిరాం తెలిపారు.