calender_icon.png 16 January, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.5 కోట్లు అప్పిస్తామని 60లక్షల మోసం

08-08-2024 03:54:02 AM

  1. వ్యాపారి వద్ద ఉన్న రూ.60 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లు
  2. ముగ్గురు నిందితుల అరెస్టు, పరారీలో మరో ఐదుగురు
  3. వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 

నల్లగొండ, ఆగస్టు 7 (విజయక్రాంతి) :  ఓ వ్యాపారికి రూ.5కోట్ల అప్పిస్తామని నమ్మించి.. దాడిచేసి అతడి వద్ద ఉన్న  రూ.60 లక్షల నగదుతో ఉడాయించారు కేటుగాళ్లు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎస్పీ శరత్‌చంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సమీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.

అతడికి రూ.5 కోట్లు అవసరం ఉండటంతో శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడలోని గాంధీనగర్‌కు చెందిన కండెల గణేశ్, మల్లికార్జున్‌ను సంప్రదించాడు. జూలై 31న సమీర్‌కు వీరు.. రూ.90 లక్షలు ఇచ్చి బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి పేపర్లు తీసుకున్నారు. ఈనెల 5న సమీర్ వారిని డబ్బు కావాలని మరోసారి సంప్రదించగా తామిచ్చిన రూ.90 లక్షలతోపాటు ఇవ్వబోయే రూ.ఐదు కోట్లకు.. ముందుగానే రూ.60 లక్షల వడ్డీ తీసుకొని రావాలని సూచించారు.

మరుసటి రోజు సమీర్ రూ.కోటి 50 లక్షలతో గాంధీనగర్‌లోని వీరన్న అనే వ్యక్తి ఇంటికి వచ్చాడు. పథకం ప్రకారం గణేష్, మల్లికార్జున్ తాము ముందస్తుగా ఇచ్చిన రూ.90 లక్షలు సమీర్ నుంచి తీసుకున్నారు. అనంతరం రూ.60 లక్షల వడ్డీ డబ్బులు చూపాలని అడిగారు.. నగదు చూపుతుండగా అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు, నలుగురు మహిళలతో కలిసి సమీర్‌తోపాటు అతడి వెంట వచ్చిన వ్యక్తులపై దాడిచేసి నగదుతో పరారయ్యారు. నిందితుల్లో ముగ్గురు మహిళలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. గణేష్, మల్లికార్జున్, విజయ్, రాజు, వీరన్న, గంగమ్మ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.