calender_icon.png 9 October, 2024 | 3:47 PM

ఐదు రోజుల్లో రూ.16.26 లక్షల కోట్లు

05-10-2024 12:00:00 AM

  1. ఇన్వెస్టర్లు నష్టపోయిన సంపద
  2. సెన్సెక్స్ మరో 800 పాయింట్లు పతనం

25,000 దిగువకు నిఫ్టీ

ముంబై, అక్టోబర్ 4: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, దేశం నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లిస్తున్న ఫలితంగా స్టాక్ మార్కెట్ శుక్రవారం మరో భారీ పతనాన్ని చవిచూసింది.  ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాలు వెల్తువెత్తడంతో సూచీలు వరుసగా ఐదో రోజూ పడిపోయాయి.

గురువారం భారీగా 1,770 పాయింట్లు తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం మరో  808 పాయింట్లు క్షీణించి 81,532 పాయింట్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపు ఐటీ షేర్ల అండతో 83,368 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత వేగంగా ఆ స్థాయి నుంచి 1,800 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పతనమయ్యింది. ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  25,485 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి 24,966 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.

చివరకు 235 పాయింట్ల నష్టంతో 25,014 పాయింట్ల వద్ద నిలిచింది. గత ఐదు ట్రేడింగ్  రోజుల్లో సెన్సెక్స్ 4,000 పాయింట్లకుపైగా  క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.16.26 కోట్ల మేర హరించుకుపోయింది. గత శుక్రవారం నుంచి బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.16,26,291 కోట్లు తగ్గి, రూ.4,60,89,598 కోట్లకు (5.49 ట్రిలియన్ డాలర్లు) తగ్గింది.

ఈ వారం మొత్తంమీద (నాలుగు ట్రేడింగ్ సెషన్లు) సెన్సెక్స్ 3,883 పాయింట్లు (4.6 శాతం) , నిఫ్టీ 1,164 పాయింట్లు (4.5 శాతం) చొప్పున తగ్గాయి. ఒకే వారంలో ఇంతగా క్షీణించడం గత రెండేండ్లలో ఇదే ప్రధమం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, ఈ వారం మార్కెట్ గత రెండేండ్లలో ఎన్నడూలేనంత పతనాన్ని చవిచూసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు.

ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్‌లు పాజిటివ్‌గా ముగిసాయి. చైనా మార్కెట్‌కు సెలవు. యూరప్ సూచీలు గ్రీన్‌లోనే ముగిసాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్ ధర 1 శాతం మేర పెరిగి 78.39 డాలర్లకు చేరింది. 

బేరిష్ సెంటిమెంట్ కొనసాగింపు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా సమీప భవిష్యత్తులో బేరిష్ సెంటిమెంట్ కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రతీ పెరుగుదలలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడతారని ఆయన అంచనా వేశారు. అలాగే చౌకగా లభిస్తున్న చైనా షేర్లలోకి విదేశీ నిధులు తరలివెళ్లడం, క్రూడాయిల్ ధరలు పరుగు తీస్తుండటంతో వచ్చే కొద్ది రోజుల్లో భారత మార్కెట్ బేరిష్‌గానే ఉంటుందన్నారు. 

రూ.40,000 కోట్లు విదేశీ పెట్టుబడులు వెనక్కు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు శుక్రవారం సైతం కొన సాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.9,896 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గ ణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ ఫండ్స్ రూ.30,000 కోట్ల మేర నికర విక్రయా లు జరిపారు. మొత్తంగా గత శుక్రవారం నుంచి ఐదు  రోజుల్లో రూ.40,000 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.

ఖరీదైన భారత్ ఈక్విటీల నుంచి చౌకగా లభిస్తున్న చైనా, హాంకాంగ్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలిస్తున్నారని, ఇటీవల చైనా కేంద్ర బ్యాంక్ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చి, అక్కడి కంపెనీల లాభాలు పెరగడానికి దోహదపడుతుందన్న భావన విదేశీ ఫండ్స్‌లో నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. 

ఎం అండ్ ఎం టాప్ లూజర్

సెన్సెక్స్-30 బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 3.3 శాతం తగ్గింది. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2.5 శాతం వరకూ తగ్గాయి.  ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు లాభపడ్డాయి.

వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 1.60  శాతం తగ్గింది. ఆటోమొబైల్స్ ఇండెక్స్ 1.50 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 1.25 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.20 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.18 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.14 శాతం చొప్పున తగ్గాయి. ఒక్క ఐటీ ఇండెక్స్ మాత్రం లాభపడింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.80 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం చొప్పున క్షీణించాయి.